గడిచిన ఐదేళ్లలో మొబైల్ డేటా ఛార్జీలు భారీగా తగ్గినా.. టెలికాం సంస్థల ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.
2014లో 1జీబీ డేటా ఛార్జీ రూ.269 ఉండగా అది 2018లో రూ.11.78కి తగ్గింది. 2014లో రూ.22,265 కోట్లుగా ఉన్న టెలికాం సంస్థల ఆదాయం 2018లో 2.5 శాతం పెరిగి రూ.54,671 కోట్లుగా నమోదైనట్లు ట్రాయ్ పేర్కొంది.
గడిచిన ఐదేళ్ళలో డేటా వినియోగం ఇలా...
దేశంలో 2014తో పోలిస్తే... 2018లో డేటా వినియోగం 56 రెట్లు పెరిగి 4,640.4 కోట్ల జీబీ డేటా వినియోగించారు. 2014లో 828 జీబీ డేటా మాత్రమే వినియోగమైంది.
ఇదే కాలానికి వినియోగదారుల పరంగా చూస్తే 2018లో సగటున ఒక యూజర్ 7.6 జీబీ డేటాను వినియోగిస్తే.. 2014లో ఇది 0.27జీబీగా మాత్రమే ఉంది.
వైర్లెస్ డేటా వినియోగంలో 4జీ టాప్
2018లో వినియోగమైన డేటా మొత్తంలో 4జీ వాటా అత్యధికంగా 86.85 శాతం ఉంది. ఇది 4,030.4 కోట్ల జీబీ డేటాకు సమానం. ఇదే సమయంలో 3జీ, 2జీ, సీడీఎంఏ డేటా వినియోగం వరుసగా 12.18 శాతం, 0.95 శాతం, 0.01 శాతంగా ఉంది. ఈ మూడింటి వాటా కేవలం 610 కోట్ల జీబీ డేటాకు సమానం.
గత ఐదేళ్లలో పశ్చిమ్ బంగ, ఉత్తర ప్రదేశ్(తూర్పు), అసోం ప్రాంతాల్లో వైర్లెస్ డేటా వినియోగం 100 శాతం పెరిగింది. ఇదే సమయానికి ఇతర ప్రాంతాల్లో 50 శాతం మేర వృద్ధి నమోదైంది.
ఇదీ చూడండి:ఒక్క సానిటరీ ప్యాడ్‌ను 120సార్లు వాడొచ్చు!