ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు చేపట్టింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యంగా బ్యాంకింగ్ రంగ ప్రక్షాళనకు పూనుకుంది. ఈ రంగంలో పలు కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై కీలక ప్రకటన చేశారు.
మొత్తం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు పరిమితం చేసేలా విలీన ప్రక్రియను ప్రకటించారు.
రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్బీ...
మొదట పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేయనున్నట్లు తెలిపిన నిర్మలా సీతారామన్.. తద్వారా 17.95 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ ఏర్పడనుందని వివరించారు. సిండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌లో విలీనం చేయనున్నారు. యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ను విలీనం చేసి దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంక్‌గా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం కానున్నట్లు ప్రకటించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్‌లు విలీనం అవుతాయి. ఈ విలీనం ద్వారా రూ. 17.95 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ ఏర్పడనుంది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ విలీనం అవ్వడం వల్ల...రూ. 15.20 లక్షల కోట్ల వ్యాపారంతో నాలుగో అతిపెద్ద బ్యాంక్ ఏర్పడనుంది. ఇది కెనరా బ్యాంక్ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను విలీనం చేస్తాం. దీనివల్ల రూ.14.59 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే అయిదో అతి పెద్ద బ్యాంక్ ఆవిర్భవించనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్ విలీనం కావడం వల్ల... రూ.8.08 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే ఏడో అతి పెద్ద బ్యాంకు ఏర్పడనుంది.
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులుగా కొనసాగుతాయన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లు ఆయా పేర్లతోనే కొనసాగనున్నాయి.
మంచి ఫలితాలు...
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేపట్టిన సంస్కరణల కారణంగా ఇప్పటికే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపిన నిర్మలా సీతారామన్.. 2019-20 తొలి త్రైమాసికంలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు నమోదు చేసినట్లు తెలిపారు.
బ్యాంకుల వాణిజ్య నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్న నిరర్థక ఆస్తులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన 2018-19 మూడో త్రైమాసికంలో 8.65 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. చివరి త్రైమాసికానికి 7.9 లక్షల కోట్లకు తగ్గాయని ప్రకటించారు.
బ్యాంకులు 250 కోట్ల రూపాయలకుపైగా ఇచ్చే రుణాలను పర్యవేక్షించేందుకు.. పారదర్శకత కోసం ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకులను మోసగించిన నీరవ్ మోదీ వంటివారిని అడ్డుకునేందుకు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థకు స్విఫ్ట్ సందేశాలను అనుసంధానం చేసినట్లు తెలిపారు.
ఆర్థికమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు..
- 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా చర్యలు.
- బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు.
- గృహ, వాహనాల, తనఖా రుణాలను ప్రారంభించిన 8 ప్రభుత్వ రంగ బ్యాంకులు.
- సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలి.
- రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్షిస్తున్నాయి.
- రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయి.
- 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయి
- నీరవ్ మోదీ లాంటి ఉదంతాలు మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
- రూ. 250 కోట్ల కంటే ఎక్కువ రుణాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేస్తున్నాం.