రాత్రివేళల్లో ఒంటరిగా ఆటో, క్యాబ్‌లలో ప్రయాణించేవారు ఇకమీదట పెద్దగా భయపడాల్సిన అవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రతను పెంపొందించేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీరు ప్రయాణిస్తోన్న వాహనం వేరే మార్గంలో వెళ్తే.. ఈ ఫీచర్ ద్వారా మీ బంధుమిత్రులకు నోటిఫికేషన్ వెళ్తుంది.
లేటెస్ట్ గూగుల్ మ్యాప్స్ వెర్షన్ ఉన్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సదుపాయం ఉంటుంది. దోపిడీలు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ సదుపాయం ఎంతో ఉపకరిస్తుందని పేర్కొన్నారు గూగుల్ మ్యాప్స్ ప్రొడక్ట్ మేనేజర్ అమందా.
క్యాబ్ లేదా ఆటో డ్రైవర్.. గూగుల్ సూచించిన మార్గాన్ని దాటి అరకిలోమీటరు వెళ్లినా ప్రయాణికుల మొబైల్‌ను మోగిస్తుంది. ఆ హెచ్చరికతో నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయగానే.. వారు అసలు గమ్యస్థానానికి ఎంతదూరంలో ఉన్నారో తెలుసుకొని.. లైవ్ లొకేషన్‌ను కుటుంబసభ్యులు, మిత్రులతో పంచుకోవచ్చు.
''భద్రతా సంబంధిత ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారని మా పరిశోధనలో తేలింది. దీనిని దృష్టిలో ఉంచుకొని మేం.. కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చాం.''
- అమందా బిషప్, గూగుల్ మ్యాప్ ప్రొడక్ట్ మేనేజర్
గూగుల్ మ్యాప్స్‌లో వెళ్లాల్సిన ప్రదేశాన్ని.. ఏ దిశలో వెళ్లాలో శోధించినపుడు.. 'స్టే సేఫర్'.. 'గెట్ ఆఫ్-రూట్ అలర్ట్స్'..'లైవ్ లొకేషన్' ఎంపికలను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.