విదేశీ సెక్యూరిటీస్‌ల్లో పెట్టుబడుల పెట్టాలనే ఆసక్తి దేశీయ మదుపర్లలో పెరుగుతోంది. అలాంటి వారి కోసం ఓ అంతర్జాతీయ పెట్టుబడుల ప్లాట్‌ఫాంను ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రపంచంలోని ఎక్కడ నుంచైనా ఒకటే ఖాతా ద్వారా అమెరికా సహా ఇతర ప్రపంచ సెక్యూరిటీస్‌ల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.
ఇందుకుగాను న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం స్టాకాల్ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాంను జియోజిత్ అభివృద్ధి చేసింది. ప్రపంచ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని తెచ్చుకునేందుకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుందని తెలిపింది. 2020 ప్రారంభం నుంచి ప్రపంచ మార్కెట్లలో దేశీయ చిన్న మదుపర్లు రూ.350 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని మార్కెట్ గణాంకాలను ఉటంకిస్తూ సంస్థ వివరించింది.
రోజుకు 2మిలియన్ డాలర్ల లావాదేవీలు
తమ ప్లాట్‌ఫాం ద్వారా రోజుకు సగటున భారత్ నుంచి 2 మిలియన్ డాలర్ల లావాదేవీలు నమోదవుతున్నాయని స్టాకాల్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సీతాశ్వ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటివరకు భారత మదుపర్లు స్టాకాల్ ప్లాట్‌ఫాం ద్వారా ఈక్విటీ ఇండెక్స్ ఈటీఎఫ్‌లు, అమెజాన్, యాపిల్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, టెస్లా లాంటి దిగ్గజ సాంకేతికత షేర్లలో, పసిడి, వెండి, చమురు లాంటి కమొడిటీ ఈటీఎఫ్‌ల్లో, ట్రెజరరీ ఈటీఎఫ్‌ల్లో సుమారు రూ.12,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. ప్రపంచ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వినియోగదార్లకు, చిన్న మదుపర్లకు, అధిక సంపన్న మదుపర్లకు, ఐటీ వృత్తి నిపుణులు లాంటి వారికి ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుందని వివరించారు.
ఇదీ చూడండి:అమెరికా జీడీపీ రికార్డు- క్యూ3లో 33.1 శాతం వృద్ధి