సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేటు రంగ సంస్థ ఎస్ బ్యాంక్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యప్తు ముమ్మరం చేసింది. ఈ వివాదంలో బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రానా కపూర్ సహా పలువురు అధికారులపై ఇప్పటికే మనీలాండరింగ్ (పీఎంఎల్ఏ) అభియోగాలు మోపింది ఈడీ. ఇందులో భాగంగా ముంబయిలోని రానా కపూర్ ఇంట్లో శుక్రవారం తనిఖీలు చేపట్టిన ఈడీ.. నేడు మరోమారు ఆయన్ను ప్రశ్నిస్తోంది.
రానా కపూర్‌ను బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఈడీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అభియోగాలు.. విచారణ
డీహెచ్ఎఫ్ఎల్కు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. ఆ సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో రానాకపూర్ పాత్రపై ఈడీ ప్రశ్నిస్తోంది.
మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా వారి నుంచి ఆయన కొంత సొమ్ము పొందారన్న అభియోగాలు ఉన్నాయి. ఆయన భార్య ఖాతాలోకి అవి చేరినట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్ బ్యాంకు సంక్షోభానికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ కపూర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనా ఈడీ ఆయన్ను ప్రశ్నిస్తోంది.
వినియోగదారుల విలవిల
ఎస్ బ్యాంక్‌పై మారటోరియం, లావాదేవీలపై రూ.50,000 పరిమితిని విధిస్తూ ఆర్బీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. నగదు ఉపసంహరణకు ఏటీఎంల వద్ద బారులు తీరారు. నగదు జమ మెషిన్లలో డిపాజిట్లు పూర్తిగా నిలిచిపోయాయి. కొందరు వినియోగదారులు ఎస్ బ్యాంక్ శాఖల్లో చెక్‌ల ద్వారా రూ.50,000 ఉపసంహరించుకున్నారు.
అయితే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నగదు కొరతతో ఎస్ బ్యాంక్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ సేవలు నిలిచిపోయినట్లు మరికొంత మంది ఫిర్యాదు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఎస్ బ్యాంకులో రూ.265 కోట్లు విత్‌డ్రా.. ఎలా సాధ్యం?