ఆర్థిక మాంద్య పరిస్థితులు.. ఉద్యోగ కల్పనపై ప్రతికూల ప్రభావం చూపాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకోరాప్ పరిశోధనా నివేదిక స్పష్టం చేసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల సృష్టి తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. 16 లక్షల మేర ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని తేల్చింది. ఇతర ప్రాంతాల నుంచి అసోం, రాజస్థాన్‌లకు వెళ్లే ఆదాయాలు తగ్గాయని నివేదిక అభిప్రాయపడింది.
"ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 89.7 లక్షల నూతన ఉద్యోగాల సృష్టి జరిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 15.8 లక్షలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది."
-ఎస్బీఐ నివేదిక
ఈపీఎఫ్ఓ గణాంకాలతో..
రూ.15వేలు అంతకంటే తక్కువ నెలసరి వేతనాలు ఉన్నవారి ఈపీఎఫ్ఓ గణాంకాలను పరిశోధన కోసం పరిగణనలోకి తీసుకుంది ఎస్బీఐ. దాని ప్రకారం 2019 ఏప్రిల్-అక్టోబర్ మధ్య 43.1 లక్షల నూతన ఉద్యోగాల కల్పన జరిగిందని తేల్చింది. ఈ సంఖ్య 2020 ఆర్థిక సంవత్సరం మొత్తంగా 73.9 లక్షలుగా ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
అయితే ఈపీఎఫ్ఓ జాతీయ పింఛన్ పథకం(ఎన్పీఎస్) కిందకు వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను లెక్కలోకు తీసుకోదు. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగాలను ఈ నివేదికలోకి తీసుకోలేదు.
"ప్రస్తుత అంచనాల ప్రకారం ఎన్పీఎస్ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు ఉద్యోగాల కల్పనలోనూ ఈ ఏడాది సుమారు 39 వేల ఉద్యోగాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది."
-ఎస్బీఐ నివేదిక
పలు రాష్ట్రాల్లోనూ..
అసోం, బిహార్, రాజస్థాన్, ఒడిశాల్లోని బయటి రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిందని పేర్కొంది నివేదిక. దివాళా తీయడం వంటి కారణాల వల్లా వ్యాపార సంస్థలు ఒప్పంద కార్మికులను తగ్గించుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
వలసదారుల నుంచే అధిక ఆదాయం
భారత్‌లోని అన్ని వర్గాల వారికి వలస వెళ్లడమే ఓ ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు నివేదిక తేల్చింది. అసమానతల కారణంగా వ్యవసాయికంగా, పారిశ్రామికంగా తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల వారు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వలస వెళ్తున్నట్లు వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లకు చెందినవారు ఎక్కువగా పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రకు వలస వెళుతున్నట్లు పేర్కొంది నివేదిక. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీకి వలసలు ఉన్నట్లు సమాచారం. ఈ వలస కార్మికులు ఆయా రాష్ట్రాల్లో ఉన్న తమ కుటుంబాలకు ఎక్కువగా ఆదాయాన్ని పంపుతున్నారని నివేదిక వెల్లడించింది.
ఇదీ చూడండి: రిలయన్స్ కొత్త ఎండీగా తొలిసారి నాన్-అంబానీ!