కరోనాతో భారీగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది (2021) తిరిగి పుంజుకుంటుందని శానిటరీవేర్ కంపెనీల నుంచి వినియోగదారు వస్తువులను తయారు చేసే సంస్థల వరకు భారీ ఆశలు పెట్టుకున్నాయి. అయితే కొవిడ్ 19 వల్ల క్లిష్ట పరిస్థితులు పూర్తిగా తొలగిపోలేదనే వాస్తవాన్ని ఆయా కంపెనీలు గుర్తు పెట్టుకోవడం గమనార్హం.
ఈ ఏడాది కరోనా వల్ల మార్కెట్లు భారీ ఒడుదొడుకులను ఎదుర్కొన్న తర్వాత.. అన్ని రంగాల్లోని కంపెనీలు తమ బ్యాలెట్ షీట్లను పటిష్ఠంగా చేసుకోవాలని కూడా భావిస్తున్నాయి.
టూరిజం, ఫుడ్, బేవరేజెస్ రంగాల నుంచి శానిటరీవేర్ కంపెనీల వరకు.. ఆరోగ్యం, పరిశుభ్రత విభాగాలపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించాయి. దీనితో పాటు కరోనాతో ఏర్పడిన సవాళ్లను అధిగమించేందుకు డిజిటల్ సేవల విస్తరణపై దృష్టి సారిస్తున్నట్లు కూడా పేర్కొన్నాయి.
కంపెనీల ఆశలు..
2021లో ఆర్థిక వ్యవస్థ రికవరీ మాత్రమే కాకుండా.. భారీ వృద్ధి సంకేతాలను కూడా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రోకా బాత్రూమ్ ఇండియా ఎండీ కేఈ రంగనాథ్. ఇప్పటికే తమ బ్రాండ్లలో కొన్నింటి ఆదాయం 90 శాతం నుంచి 100 శాతానికి రికవరీ అయినట్లు వెల్లడించారు.
తగ్గిన గృహ రుణాల రేటు, ఆకర్షణీయమైన పేమెంట్ పథకాల కారణంగా 2021లో గృహ నిర్మాణ రంగం, దాని అనుబంధ రంగాలకు డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు జాక్వార్ గ్రూప్ డెరెక్టర్ రాజేశ్ మెహ్రా తెలిపారు. అయితే మార్కెట్ రికవరీ 2021 ద్వితీయార్ధంలోనే సాధ్యమన్నారు.
ఇతర రంగాలు కూడా.. వినియోగదారులను ఆకర్షించేందుకు 2021లో అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని తమ వ్యాపారాలను సాగిస్తామని వివరించాయి.
ఇదీ చూడండి:దిగొచ్చిన పసిడి, వెండి- నేటి ధరలివే..