చౌకధరలో ఒక ఐఫోన్‌ను విడుదల చేయాలని అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల (ఫిబ్రవరి)లోనే దీని తయారీ చేపట్టాలని, మార్చిలో విడుదల చేయాలన్నది సంస్థ ప్రణాళికగా, ఈ అంశంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించినట్లు వార్తాసంస్థ బ్లూంబర్గ్ తెలిపింది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ విపణిలో మరింత వాటా చేజిక్కించుకునేందుకు ఈ పరిణామం దోహద పడుతుందని సంస్థ భావిస్తోంది.
ఈ కొత్త ఫోన్ తయారీ పనులను విభజించి, తైవాన్‌కు చెందిన హాన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ, పెట్రాన్ కార్పొరేషన్, విస్ట్రన్ కార్పొరేషన్లకు అప్పగించినట్లు చెబుతున్నారు. ఐఫోన్ ఎస్ఈ తర్వాత ఇది తక్కువ ధర ఐఫోన్‌గా పేర్కొంటున్నారు.
యాపిల్ బడ్జెట్ ఫోన్ ఇలా ఉండొచ్చు..
2017లో ఆవిష్కరించిన ఐఫోన్ 8 తరహాలో 4.7 అంగుళాల తెరతో ఈ ఫోన్ ఉంటుందని సమాచారం. హోమ్ బటన్‌లో టచ్ ఐడీ ఉంటుందని, ముఖాన్ని గుర్తించే పరిజ్ఞానం ఉండబోదని అంటున్నారు. అధునాతన ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లు 200 డాలర్ల (సుమారు రూ.14,000) లోపే లభిస్తుండగా, ఈ ఐఫోన్‌తో యాపిల్ కూడా భారత్‌లో వాటా పెంచుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులో 5జీ స్మార్ట్ఫోన్లను యాపిల్ ఆవిష్కరించనుంది.
ఇదీ చూడండి:ఉద్యోగులకు ఈపీఎఫ్ ఓ కొత్త సదుపాయం