టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా మేలో చెరో 47 లక్షల మంది చందాదారులను కోల్పోయినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం ప్రకటించింది. ఇదే సమయంలో రిలయన్స్ జియోకు 37 లక్షల మంది చందాదారులు పెరిగినట్లు వెల్లడించింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు కూడా 2 లక్షలకుపైగా చందాదారులు పెరిగినట్లు వివరించింది.
తగ్గిన మొత్తం యూజర్లు..
మేలో 2జీ, 3జీ, 4జీ విభాగాల్లో మొత్తం యూజర్లు 0.5 శాతం తగ్గినట్లు తెలిపింది ట్రాయ్. కొవిడ్-19 నేపథ్యంలో వలస కార్మికులు భారీ సంఖ్యలో పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లడం ఇందుకు కారణంగా పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ సిమ్‌కార్డులు ఉన్నవారు.. శాశ్వతంగా వాడే నంబర్ తప్ప మిగతా వాటిని డీయాక్టివేట్ చేసుకోవడం వంటి పరిణామాలూ.. యూజర్ల సంఖ్య తగ్గేందుకు కారణమైనట్లు పేర్కొంది.
మొత్తం యూజర్లు..
ట్రాయ్ లెక్కల ప్రకారం మొత్తం యూజర్ల సంఖ్య.. మేలో 56.1 లక్షలు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్లు సంఖ్య 62.9 కోట్ల(ఏప్రిల్‌లో) నుంచి 62 కోట్లకు (మే చివరి నాటికి) తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ సంఖ్య 52 కోట్ల నుంచి (ఏప్రిల్‌లో) 52.3 కోట్లకు (మే చివరి నాటికి) పెరిగింది.
ల్యాండ్ లైన్ యూజర్ల సంఖ్య కూడా ఏప్రిల్‌లో 19.9 మిలియన్లుగా ఉండగా.. అది మే చివరి నాటికి 19.77 మిలియన్లకు తగ్గినట్లు ట్రాయ్ వివరించింది.
ఇదీ చూడండి:త్వరలోనే భారత్‌లో యాపిల్ ఆన్లైన్ స్టోర్!