Zee Sony Merger: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా(ఎస్పీఎన్ఐ), జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఈఈఎల్) మధ్య కుదిరిన విలీన ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు నిర్దిష్టమైన ఒప్పందాలపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. 90 రోజులు జరిగిన చర్చల్లో ఉభయపక్షాలకు లబ్ధి చేకూరేలా నిబంధనలు ఖరారయ్యాయి. ఫలితంగా రెండు సంస్థల లీనియర్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ కార్యకలాపాలు ఇకపై ఒకే సంస్థ కిందకు రానున్నాయి.
అతిపెద్ద నెట్‌వర్క్‌గా:
Sony Zee Merger Price: ఇకపై దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌గా జీ-సోనీ విలీనానంతర సంస్థ అవతరించే అవకాశం ఉంది. విలీన సంస్థకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ పునిత్ గోయెంకా సారథ్యం వహించేందుకు జీ బోర్డు పచ్చజెండా ఊపింది. ఈ ఒప్పందం వల్ల జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్‌లో విలీనం కానుంది. తద్వారా జీ షేర్‌హోల్డర్లకు సోనీ పిక్చర్స్ షేర్లు దక్కుతాయి. ప్రతి 100 జీ షేర్లకు.. 85 సోనీ పిక్చర్స్ షేర్లు కేటాయిస్తారు. ప్రమోటర్లతో కలుపుకొని మొత్తం జీ షేర్‌హోల్డర్లకు రూపాయి ముఖ విలువ కలిగిన 81.65 కోట్ల షేర్లు లభించనున్నాయి. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ తమ షేర్లను విభజించి బోనస్ ఇష్యూ ద్వారా బోనస్ షేర్లు కేటాయించనుంది. రైట్స్ ఇష్యూ ద్వారా 7 వేల 948.69 కోట్లు చొప్పించి.. మరో 26.5 కోట్ల షేర్లను సోనీ పిక్చర్స్ జారీ చేయనుంది. జీ ప్రమోటర్ సంస్థల్లో ఒకటైన ఎస్సెల్ హోల్డింగ్స్‌కు ఎస్‌పీఈ మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్స్ నాన్-కంపీట్ ఫీజు కింద 11 వందల కోట్లు చెల్లించనుంది. ఈ మొత్తాన్ని సోనీ పిక్చర్స్‌లో ఎస్సెల్ పెట్టుబడిగా పెట్టి కొత్త సంస్థలో 2.11 శాతం అదనపు వాటా సొంతం చేసుకోనుంది. ఈ విలీన ఒప్పందానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభిస్తే సోనీ పిక్చర్స్‌కు 50.86 శాతం, ఎస్సెల్ గ్రూప్‌నకు 3.99 శాతం, జీ షేర్‌హోల్డర్లకు 45.15 శాతం వాటాలు లభించనున్నాయి.
Zee Merger with Sony: విలీనానంతరం ఏర్పడే సంస్థలో సోనీ గ్రూప్‌నకు చెందిన ఈక్విటీ వాటాలను సొంతం చేసుకోవడానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి అధికారాలు ఉండవు. విలీనానంతర సంస్థకు 75 టీవీ ఛానళ్లు, 2 వీడియో స్ట్రీమింగ్ సేవలైన జీ5, సోనీ లివ్ సహా రెండు ఫిల్మ్ స్టూడియోలు, డిజిటల్ కంటెంట్ స్టూడియో ఉంటాయి. తద్వారా భారత్‌లోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ సంస్థగా జీ-సోనీ విలీనానంతర సంస్థ అవతరిస్తుంది.
ఇదీ చదవండి: Disney Plus Hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్లాన్.. రూ.49కే!