మార్కెట్లో నిరంతరం కొత్త మోడళ్ల ఫోన్లు విడుదలవుతూనే ఉంటాయి. ఇప్పటికే మన దేశంలో ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్త ఫీచర్లతో ఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదార్లు ఆసక్తి చూపుతుంటారు. అధునాతనమైన సౌకర్యాలు కలిగిన ఈ ఫోన్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. ప్రమాదవశాత్తూ కిందపడటం, నీళ్లలోపడటం లాంటివి జరిగితే ఫోన్ పాక్షికంగా లేదా పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లకు బీమా చేసుకునే అంశాన్ని పరిశీలించొచ్చు. పలు రకాల సంస్థలు ఈ గాడ్జెట్ బీమా పథకాలను అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లాంటి గాడ్జెట్లకు బీమా చేసుకోవడం ద్వారా ప్రమాదవశాత్తు దెబ్బతిన్నా మరమ్మత్తు లేదా కొత్త ఫోను పొందే అవకాశం ఉంటుంది. ప్రముఖ మొబైల్ కంపెనీలు, మొబైల్ విక్రయ సంస్థలు బీమా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్ కొన్నప్పుడే బీమా సౌకర్యాన్నిఅందిస్తున్నాయి. అయితే పథకం తీసుకునేముందు బీమా వర్తించే, వర్తించని సందర్భాలేవో తెలుసుకోవాలి. బీమా సంస్థలు వివిధ రకాల పథకాలను అందుబాటులో ఉంచుతాయి.
సాధారణంగా బీమా వర్తించే సందర్భాలు
అగ్ని ప్రమాదాలు, అల్లర్లు, ఉగ్రదాడులు జరిగినప్పుడు, దొంగతనానికి గురైనప్పుడు, నీళ్లలో పడి పాడైనప్పుడు బీమా వర్తిస్తుంది.
ఇలా అయితే.. బీమా వర్తించదు
కొన్ని ప్రత్యేక పరిస్థితులకు బీమా వర్తించదని కంపెనీలు షరతులు పెడతాయి.
అనుమానాస్పద స్థితిలో మొబైల్ పోగొట్టుకున్నప్పుడు, దేశం వెలుపల మొబైల్ పోగొట్టుకున్నప్పుడు వర్తించదు. బీమా చేయించని వ్యక్తి వద్ద ఉన్నప్పుడు కాకుండా మరో వ్యక్తి ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్ పాడైనా లేదా పోగొట్టుకున్నా సరే వర్తించదు. అధీకృత సంస్థల వద్ద కాకుండా వేరే ఎక్కడైనా మరమ్మతు చేయించినప్పుడు ఫోన్‌కు ఏదైనా అయితే బీమా వర్తించకపోవడం ఉంటుంది. బీమా కంపెనీ బట్టి పాలసీలో షరతులు, లక్షణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి బీమా తీసుకునే ముందు ఆ బీమా పథకం షరతులను పూర్తిగా చదవాలి.
మొబైల్ కొన్న ఒకటి, రెండు రోజుల్లోపే బీమా తీసుకోవాలి. ఆన్‌లైన్ విధానంలో అయితే ఇంటర్నెట్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని పూరించాల్సి ఉంటుంది. తర్వాత బీమా కంపెనీలు మొబైల్ కొనుగోలు బిల్లు, వ్యక్తిగత గుర్తింపు పత్రం లాంటి వివరాలను పోస్ట్‌లో పంపాల్సిందిగా కోరతాయి. కొన్ని కంపెనీలు వాట్సప్‌లో డాక్యుమెంట్ల ఫోటోలు తీసి పంపేందుకు అవకాశమిస్తున్నాయి.
క్లెయిమ్ ఎలా చేసుకోవాలంటే..
క్లెయిమ్ చేయాలంటే మొబైల్ ఫోన్ పోయినట్లుగా గుర్తించిన వెంటనే 24 గంటల్లోగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 48 గంటల్లోగా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. క్లెయిమ్ ఫారం, మొబైల్ కొనుగోలు బిల్లు, క్లెయిమ్ వివరాలను తెలియజేసే పత్రం , మొబైల్ దొంగతనమైనట్లు స్థానిక పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు కాపీ దగ్గర ఉంచుకోవాలి. అదే ప్రమాదవశాత్తు పగిలిన వాటికి ఫోన్ స్క్రీన్ ఫొటో, ఐఎంఈఐ నంబరుతో కూడిన ఫొటోతో పాటుగా అధీకృత సేవా కేంద్రం అందించే అంచనా బిల్లు అవసరమవుతాయి. క్లెయిమ్ పొందేందుకు బీమా కంపెనీ సూచించిన విధానాలు పాటించాలి.
ఇదీ చదవండి:చిప్‌ల కొరతతో.. ప్రపంచం సతమతం