క్రెడిట్ కార్డుతో వడ్డీ లేకుండా కొంత కాలానికి రుణం పొందొచ్చు. ఈ సదుపాయం ఉన్న కారణంగా క్రెడిట్ కార్డులను ఆదరించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రజల ఆర్థిక జీవనంలో ఒక భాగం అయిపోయాయి. చేతిలో డబ్బు లేకపోయినా ఇంటి అవసరాల కోసం.. అంటే కావలసిన వస్తువుల కొనుగోలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్, బిల్లులు, ఫీజులు, సబ్‌స్క్రిప్షన్లు సులభంగా చెల్లించవచ్చు. సరిగ్గా ఉపయోగిస్తే వీటి వల్ల ఉపయోగాలే ఎక్కువ. మంచి క్రెడిట్ స్కోరును పొందడంతో పాటు అదనపు రివార్డులు, క్యాష్ బ్యాక్‌లు పొందొచ్చు. అలాగని క్రెడిట్ కార్డులన్నీ ఒకే రకమైన ప్రయోజనాలు అందించవు. కార్డును బట్టి లభించే రివార్డులు మారుతుంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి ట్రావెల్ కార్డులు ఉపయోగపడితే.. కొనుగోళ్లు ఎక్కువగా చేసేవారికి షాపింగ్‌కార్డులు, ఇంధన వినియోగం ఎక్కువగా ఉన్నవారికి ఫ్యూయల్ కార్డులు ఎక్కువ రివార్డులను అందిస్తాయి. అందువల్ల చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండడం మంచిదేనా? రెండో కార్డు ఎప్పుడు తీసుకోవచ్చు?
ఒకటి కంటే ఎక్కువ కార్డుల వల్ల ప్రయోజనాలు..
రుణ పరిమితిని పెంచుకోవచ్చు..
రెండు కార్డులు తీసుకోవడం వల్ల రుణ పరిమితిని పెంచుకోవచ్చు. జీరో వార్షిక రుసుముతో, తక్కువ వడ్డీ రేటుతో వచ్చే సాధారణ క్రెడిట్ కార్డులకు క్రెడిట్ లిమిట్ తక్కువ ఉంటుంది. ఉదాహరణకు.. మీ వద్ద ఉన్న నో-ఫ్రిల్ కార్డు రూ.1లక్ష పరిమితిని అందిస్తుంటే.. రెండో కార్డు తీసుకోవడం వల్ల రూ. 2లక్షల వరకు పరిమితి లభిస్తుంది. రూ.75 వేల పరిమితితో కార్డు జారీ చేస్తే, రెండు కార్డులు ఉండడం వల్ల రూ. 1.5 లక్షల పరిమితి ఉంటుంది. అత్యవసర వైద్య సేవలు వంటి సందర్భాల్లో ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇవి మీకు సహాయపడతాయి. అలాగే చిన్న చిన్న అవసరాలకు స్వల్పకాలం కోసం స్నేహితలు, బంధువుల వద్ద నుంచి రుణం కోసం అభ్యర్థించాల్సిన అవసరం ఉండదు.
కార్డు వినియోగ నిష్పత్తిని తగ్గించుకోవచ్చు..
నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి కార్డు మొత్తం పరిమితిలో 30 నుంచి 40 శాతం వరకు వినియోగించుకోవడాన్ని ఐడిల్ నిష్పత్తి అవుతుంది. అయితే ఒక క్రెడిట్ కార్డుతో ఈ నిష్పత్తి మేరకు నిర్వహించడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ మీ వినియోగం క్రెడిట్ పరిమితిలో 80 నుంచి 90 శాతానికి చేరితే.. హెచ్చరిక చేస్తూ జారీ సంస్థ నుంచి మెసేజ్ వస్తుంది. ఈ కారణంగా క్రెడిట్ స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. రెండు కార్డులు ఉంటే క్రెడిట్ లిమిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి.. వినియోగ నిష్పత్తి 30 శాతం దాటకుండా జాగ్రత్త పడొచ్చు.
మెరుగైన క్రెడిట్ స్కోరుకు ఆస్కారం..
మంచి క్రెడిట్ స్కోరు అంటే భవిష్యత్ రుణాలుకు అర్హత ఉందని అర్థం. రెండు క్రెడిట్ కార్డులను తీసుకోవడం వల్ల కార్డును ఉపయోగిస్తూనే కార్డు వినియోగ నిష్పత్తిని అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో క్రెడిట్ స్కోరు కూడా పెరుగుతుంది. భవిష్యత్‌లో రెండు కంటే ఎక్కువ కార్డులు తీసుకున్నా వాటిని నిర్వహించడం సకాలంలో రుణాలు చెల్లించడం వంటి వాటిపై అవగాహన ఏర్పడుతుంది.
చెల్లింపులు చేయడం సులభం..
రెండు కార్డుల.. కాల చక్రాలు భిన్నంగా ఉండాలి. రెండు కార్డుల చెల్లింపులకు మధ్య పదిహేను రోజుల వ్యవధి ఉండేట్లు చూసుకోవాలి. ఒకే నెలలో రెండు కార్డులను ఉపయోగించినప్పటికీ.. చెల్లింపులు మాత్రం రెండు వేరు వేరు నెలల్లో చేసే వీలుంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల విషయంలో ఈ విధమైన మేనేజ్‌మెంట్ సౌకర్యంగా ఉంటుంది.
రెండు క్రెడిట్ కార్డులు ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయంటే దానర్థం... ఒక కార్డు ఉన్నవారు వెంటనే రెండో కార్డు తీసుకోవాలని కాదు. ఒక కార్డుతో నిర్వహణ సరిగ్గా ఉన్నప్పుడు ఒకే కార్డును ఉపయోగించడం కూడా మంచిదే. రెండో కార్డు తీసుకోవడం వల్ల ఒక్కోసారి లాభం కంటే నష్టమే ఎక్కువ జరగొచ్చు. నిర్వహణ సరిగ్గా లేకపోతే అప్పుల భారంతో కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే ఎలాంటి సందర్భాల్లో రెండో క్రెడిట్ కార్డు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..
అప్పు ఉన్నప్పుడు..
మరొక క్రెడిట్ కార్డు తీసుకుంటే.. అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది. మీరు ఇప్పటికే క్లియర్ చేయాల్సిన అప్పులు ఉంటే.. ఇవి రుణ భారాన్ని మరింత పెంచుతాయి. అందువల్ల అదనపు క్రెడిట్ కార్డు తీసుకోకపోవడమే మంచిది. అలాగే నగదు ప్రవాహం, నిర్వహణను బట్టి క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు కాబట్టి ఇప్పటికే రుణ ఒత్తిడిలో ఉంటే మరొక కార్డు పొందే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఇంటి కొనుగోలుకు ప్లాన్ చేస్తుంటే..
సమీప భవిష్యత్‌లో ఇంటి కొనుగోలుకు ప్లాన్ చేస్తుంటే క్రెడిట్‌కార్డు తీసుకోకపోవడమే మంచిది. గృహ రుణం వంటి దీర్ఘకాలిక రుణాల మంజూరులో క్రెడిట్ స్కోరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రభావం గృహ రుణంపై పడొచ్చు. రుణ మంజూరు అవకాశాలు తగ్గొచ్చు.
ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ లేకపోతే..
ఇప్పటికే ఒక కార్డు నిర్వహిస్తున్న వారికి దాని వినియోగంపై అవగాహన ఏర్పడుతుంది. కార్డు వినియోగంలో స్వీయ నియంత్రణ అంటే అనవసర ఖర్చులకు దూరంగా ఉండగలగడం.. సకాలంలో బిల్లులు చెల్లించగల సామర్థ్యం, క్రమశిక్షణ వంటివి ఉండాలి. ఆర్థిక నిర్వహణ విషయంలో నమ్మకం ఉంటే మరొక కార్డు తీసుకోవచ్చు. లేకపోతే.. నమ్మకం ఏర్పడే వరకు మరొక కార్డు జోలికి పోకుండా ఉంటేనే మంచిది.
చివరగా..
మీరు క్రెడిట్ కార్డు అందించే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే ఆర్థిక క్రమశిక్షణతో మెలగడం అవసరం. కనీస బ్యాలెన్స్‌ను మాత్రమే చెల్లించకుండా పూర్తి బకాయిలను సమయం కంటే ముందే చెల్లించడం మంచిది. దీని ద్వారా మీరు రుణ ఉచ్చులో చిక్కకుపోరు. అలాగే క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బ తినకుండా ఉంటుంది.
ఇవీ చూడండి: