ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు పరిశోధనలు, ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఈలోపు కరోనా తీవ్రతను తగ్గించి బాధితులకు ఉపశమనం కలిగించేందుకు వివిధ మందులు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కొవిడ్-19కు ఆయుర్వేద మందు తీసుకువచ్చింది ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి. 'కరోనిల్' పేరుతో ఈ మందును త్వరలో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు.
పతంజలి కొరోనిల్...
'కరోనిల్' మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. తామ తయారు చేసిన మందు 5 నుంచి 14 రోజుల్లో కొవిడ్‌ను నయం చేయగలదని స్పష్టం చేసింది. వారం రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ మెడిసిన్ కిట్ ధరను రూ.545గా నిర్ణయించినట్లు పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఇది 30 రోజులకు సరిపోతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే...
ఇప్పటికే కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఫ్యావిపిరవిర్, రెమ్‌డెసివిర్ తదితర ఔషధాలు వచ్చాయి. వాటి సమాచారం మీకోసం..
మందుల రూపంలో ఫ్యావిపిరవిర్
కొవిడ్- 19 మహమ్మారి బారిన పడిన రోగులు కోలుకునేందుకు వీలు కల్పించే యాంటీ-వైరల్ ఔషధమైన 'ఫ్యావిపిరవిర్'ను తయారుచేసి విక్రయించటానికి భారత్‌లో మొదట అనుమతి పొందిన సంస్థగా గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ నిలిచింది. 'ఫ్యాబిఫ్లూ' అనే బ్రాండ్ పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా ప్రకటించింది. కొవిడ్- 19 వ్యాధి ఒక మాదిరి నుంచి మధ్య స్థాయిలో ఉన్న రోగులకు ఈ ఔషధాన్ని ఇచ్చిన పక్షంలో నాలుగైదు రోజుల్లో 'వైరల్ లోడ్' తగ్గి, రోగి కోలుకునే అవకాశం ఉంటుందని సదరు కంపెనీ పేర్కొంది.
ఎలా వాడాలి? ధర ఎంత?
ఇది నోటి ద్వారా తీసుకునే ఔషధం. తొలిరోజు 1800 ఎంజీ డోసు రెండుసార్లు, ఆ తర్వాత రెండు వారాల పాటు రోజుకు 1600 ఎంజీ డోసు చొప్పున వాడాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఒక్కో టాబ్లెట్‌ను రూ.103 ధరకు విక్రయిస్తారు. 200ఎంజీ ట్యాబెట్ల రూపంలో ఇది రానుండగా ఒక్కో స్ట్రిప్‌లో 34 ట్యాబెట్లు ఉంటాయి. అంటే, ఒక షీట్ ధర రూ.3,500 వరకూ ఉంటుంది.
ఇంజెక్షన్ రూపంలో రెమ్‌డెసివిర్
కొవిడ్- 19తో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలిగిస్తోందని భావిస్తున్న పరిశోధనాత్మక ఔషధం (ఇన్వెస్టిగేషనల్ డ్రగ్) 'రెమ్‌డెసివిర్' తయారీకి జనరిక్ ఔషధ తయారీ సంస్థ హెటిరోకు డీసీజీఐ(డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. దీంతో గిలీడ్ సైన్సెస్ జనరిక్ వెర్షన్ రెమ్‌డెసివిర్‌ను హెటిరో ల్యాబ్స్ తయారు చేయనుంది. 'కొవిఫర్' పేరుతో దీన్ని భారత్‌లోకి తీసుకురానున్నట్లు హెటిరో ల్యాబ్స్ తెలిపింది.
ఎలా ఉపయోగించాలి?
కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి వైద్యుల సిఫారసు మేరకే 'రెమ్‌డెసివిర్' ఇవ్వాలి. పౌడర్ (100 ఎంజీ వైయల్) రూపంలో లభించే ఈ ఔషధంతో ఇంజెక్షన్ తయారు చేసి, ఐవీ ఫ్లూయిడ్ పద్ధతిలో సెలైన్ ద్వారా రోగికి ఎక్కిస్తారు. ఇది ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో చేసే చికిత్స. తప్పసరి పరిస్థితుల్లో వినియోగించే 'అత్యవసర అనుమతి' మాత్రమే ఈ ఔషధానికి ఉంది. హైదరాబాద్‌లోని ఫార్ములేషన్ యూనిట్లో తయారు చేస్తున్న ఈ ఔషధం ధర దేశీయంగా రూ.5,000-6,000గా ఉండవచ్చు. మూత్రపిండ సమస్యలు, గర్భిణులు, బాలింతలు, మహిళలు, 12 సంవత్సరాల లోపు చిన్నారులు దీనిని వాడకూడదు.
ఇవి కూడా..
ఇక సిప్లా తయారు చేస్తున్న 'సిప్రిమిని' కూడా కొవిడ్-19 బాధితులకు వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇది కేవలం వెంటిలేటర్‌పై ఆక్సిజన్ సాయంతో ఉన్న వారికి మాత్రమే వినియోగించాలి. వీటితో పాటూ టాసిలిజుమాబ్‌ను కూడా వైద్యులు కొవిడ్-19 బాధితులకు చికిత్సలో వాడుతున్నారు. ముంబయిలో వందల సంఖ్యలో కరోనా బాధితులకు దీన్ని వాడారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ గతి తప్పినప్పుడు దీన్ని చికిత్సలో భాగంగా ఇస్తారు. దీన్ని ముంబయికి చెందిన 'రోచి ఫార్మా' తయారు చేస్తోంది.
గమనిక: కరోనా చికిత్సలో వినియోగించే ఏ ఔషధాన్నైనా వైద్యుల సూచన మేరకు, వారి పర్యవేక్షణలోనే వినియోగించాలి. పైన తెలిపిన వివరాలు సమాచారం కోసం మాత్రమే.