విజయ బ్రాండ్.. ఈ పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది వంట నూనెలే. ప్రభుత్వ పరిధిలోని ఆయిల్‌ఫెడ్.. ఇక నుంచి విజయ బ్రాండ్ పేరిట పలు రకాల నిత్యావసర సరకులనూ విక్రయించనుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ పేరు మీద వంట నూనెలనే విక్రయిస్తుండగా.. తాజాగా కొత్త వ్యాపారం ప్రారంభించనుంది. ఆ బ్రాండ్‌ను ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చి పలు రకాల నిత్యావసర సరకులను మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య (టీఎస్-ఆయిల్‌ఫెడ్) విజయ బ్రాండ్ పేరుతో అమ్ముతున్న వంట నూనెలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కేవలం వీటినే విక్రయించడం వల్ల ఆదాయం పెరగడం లేదని భావించిన నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య.. విజయ బ్రాండ్‌పై ప్రజలకు నిత్యావసర సరకులను సైతం అందుబాటులోకి తీసుకువచ్చి ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఏఎస్ బ్రాండ్ అనే ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏఎస్ బ్రాండ్.. ఉప్పు, జీడిపప్పు, వేరుసెనగ, మినుప గుళ్లు, రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి, టీ పొడి, వేయించిన పల్లీలు, బాస్మతీ బియ్యం తదితర 23 రకాల ఉత్పత్తులను ‘విజయ’ పేరుతో ప్యాక్ చేసి విక్రయిస్తుంది. తొలుత 23 రకాల ఉత్పత్తులనే ఆ బ్రాండ్ ‘విజయ’ పేరిట మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. మూడేళ్లలో సుమారు వంద రకాల ఉత్పత్తులను ఇలా అమ్మాలి అనేది లక్ష్యం. ఈ నెల 23న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఆయిల్‌ఫెడ్ గోదాము వద్ద వీటి విక్రయాలను ప్రారంభిస్తారు. కొన్ని రోజుల తరవాత ఇతర దుకాణాల్లోనూ దశల వారీగా విక్రయించాలని ప్రణాళిక రూపొందించారు.
రాయల్టీ చెల్లింపునకు ఒప్పందం
విజయ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తున్నందుకు ఆ సంస్థ అమ్మకాల విలువలో తొలి ఐదేళ్లలో 0.5, తరవాతి ఐదేళ్లలో 0.7 శాతం సొమ్మును ఆయిల్‌ఫెడ్‌కు రాయల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తులను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సహకార సమాఖ్య గోదాములోనే ప్యాక్ చేస్తారు. సరకుల నాణ్యత తనిఖీ బాధ్యత ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులదే. ఈ అమ్మకాల్లో టీఎస్ ఆయిల్‌ఫెడ్ పెట్టుబడులు పెట్టడం లేదని ఎండీ సురేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏఎస్ బ్రాండ్ 200 విక్రయ కేంద్రాలు తెరిచి ఈ నిత్యావసర సరకులతోపాటు విజయ వంటనూనెలను విక్రయిస్తుందని వివరించారు. మొత్తం వంద రకాల ఉత్పత్తులు విడుదలైతే నెలకు రూ.కోటికి పైగా సమాఖ్యకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని ఎండీ వెల్లడించారు.
ఇదీ చూడండి: విజయ విస్తరణ.. ప్రైవేటు డెయిరీల నుంచి పోటీ తట్టుకునే ప్రయత్నం