దేశంలో రికార్డు స్థాయిల వద్ద ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వస్తున్న డిమాండ్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు.. రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లను ఇష్యూ చేసి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని.. తాము గత ప్రభుత్వంలా జిమిక్కులు చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు.
ప్రజల ఆందోళన సరైనదే..
పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రజల ఆందోళన సరైనదేనని నిర్మలా సీతారామన్ అంగీకరించారు. అయితే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూర్చుని చర్చిస్తే తప్ప ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించదన్నారు.
ఆయిల్ బాండ్ల వల్ల ప్రభుత్వంపై భారం అధికంగా ఉందని.. అందుకే తాము పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. చమురుపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించే యోచన కూడా లేదని స్పష్టం చేశారు సీతారామన్. యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్లకు వడ్డీ చెల్లింపులు ఇంకా మిగిలి ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు.
వడ్డీ చెల్లింపుల భారం..
ఆయిల్ బాండ్లకు.. గత ఐదేళ్లలో రూ.70,195 కోట్లను ప్రభుత్వం వడ్డీ రూపంలో చెల్లించినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి. 2026 నాటికి ఇంకా రూ.37 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. వడ్డీ అసలు కలిపి మొత్తం రూ.1.30 లక్షల కోట్ల బకాయిలు ఉన్నట్లు వివరించారు. ఆయిల్ బాండ్ల వడ్డీ భారం లేకుండా ఉంటే.. ఎక్సైజ్ సుంకాలు తగ్గించేందుకు తాము సిద్ధమేనన్నారు.
ఐటీ కొత్త పోర్టల్ లోపాలను పరిష్కరిస్తాం..
ఆదాయపు పన్ను శాఖ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలను మరో రెండు వారాల్లో పరిష్కరిస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ విషయంపై పోర్టల్‌ను నిర్వహిస్తున్న టెక్ సంస్థ ఇన్ఫోసిస్ అధినేత నందన్ నిలేకనితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: WPI inflation: జులైలోనూ దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం