ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న 130 మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ ఘటనపై ట్విట్టర్ విచారం వ్యక్తం చేసింది. హ్యాకింగ్‌కు గురైన 130 ఖాతాల్లో 45 ఖాతాల పాస్వర్డ్లు హ్యాకర్లు రీసెట్ చేయగలిగారని తెలిపింది.
'యువర్ ట్విట్టర్ డేటా' టూల్ ద్వారా 8 ఖాతాల సమాచారం హ్యాకర్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపింది ట్విట్టర్. అయితే ఆ ఖాతాలేవీ కుడా గుర్తింపు పొందినవి కాదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఖాతాదారులను సంప్రదించినట్లు వివరించింది.
"ఈ ఘటనతో మేం ఇబ్బంది పడ్డాము. నిరుత్సాహానికి గురయ్యాము. అన్నింటికంటే ముఖ్యంగా మీరు మమ్మల్ని క్షమించాలి. మళ్లీ మీ నమ్మకాన్ని తిరిగిపొందాలంటే మేం చాలా కష్టపడాలని మాకు తెలుసు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని విధాల సహకరిస్తాం."
-ట్విట్టర్
ఓజీ కమ్యూనిటీ పనే!
ఇటీవల జరిగిన ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ వెనుకున్న ఓజీ కమ్యూనిటీ హస్తం ఉన్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ 221బీ ప్రధాన పరిశోధకులు అల్లిసర్ నిక్సన్ అన్నారు. గతంలో వీరి వల్ల జరిగిన హ్యాకింగ్‌లకు ఇప్పుడు జరిగిన వాటికి పోలికలు ఉన్నట్లు తెలిపారు. అయితే ఓజీ కమ్యూనిటీ అనేది ఏ దేశం కేంద్రంగా పని చేస్తుందన్న విషయంపై స్పష్టత లేదన్నారు నిక్సన్.