ఏటీఎం ద్వారా చేసే నగదు, నగదు రహిత లావాదేవీల ఛార్జీలను పెంచేందుకు బ్యాంకులకు ఇటీవలే అనుమతినిచ్చింది.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ). అయితే ఆర్‌బీఐ నిర్ణయించిన పరిమితి మేరకు ఉచిత లావాదేవీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిమితి దాటిన లావాదేవీలకు మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
కొత్త ఛార్జీలతో.. బ్యాంకు ఖాతాదారులు పరిమితికి మించి చేసే ఒక్కో లావాదేవీకి రూ.20కి బదులుగా రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం భారత్‌లోని చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు.. తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో కలిపి) చేసుకునేందుకు అనుమతినిస్తున్నాయి. ఇతర బ్యాంకు ఏటీఎంల వద్ద మాత్రం మెట్రో నగరాల అయితే 3, ఇతర ప్రదేశాలలో 5 ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో కలిపి) చేసేందుకు అవకాశం ఉంది. ఈ పరిమితికి మించి చేసే లావాదేవీలపై ఛార్జీలు విధిస్తున్నాయి బ్యాంకులు.
ఇంటర్‌ఛేంజ్ లావాదేవీల ఫీజు పెంపు..
ఇంటర్‌ఛేంజ్ లావాదేవీల ఫీజును పెంచేందుకు కూడా ఆర్‌బీఐ అనుమతించింది. ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.15 నుంచి రూ.17 వరకు ఆర్థికేతర లావాదేవీలకు రూ.5 నుంచి రూ.6 వరకు పెంచేందుకు బ్యాంకులకు అనుమతి ఉందని ఆర్‌బీఐ తెలిపింది. ఇంటర్‌ఛేంజ్ లావాదేవీల ఫీజుల పెంపు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే అమలులోకి రానుంది.
ఈ బ్యాంకుల్లో అపరిమిత లావాదేవీలు..
మెజారిటీ బ్యాంకులు ఇదే విధానాన్ని అమలు చేస్తుండగా.. ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు మాత్రం తమ ఖాతాదారులకు అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి.
ఐడీబీఐ బ్యాంక్ కొన్ని ఎంపిక చేసిన ప్రోడక్ట్‌లకు మాత్రమే ఏటీఎం వద్ద అపరిమిత ఉచిత లావాదేవీలను నిర్వహించుకునే సదుపాయాన్ని అందిస్తోంది. మిగిలిన వాటికి ఆర్‌బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఏటీఎం వద్ద లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని అందిస్తోంది.
బ్యాంక్ సొంత ఏటీఎంలలో మొదటి 5 లావాదేవీలు ఉచితం. తరువాతి లావాదేవీ నుంచి ఛార్జీలు వర్తిస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎం మెట్రో నగరాలలో 3, ఇతర ప్రదేశాలలో 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ మాత్రం.. భారత్‌లోని ఏ బ్యాంక్ ఏటీఎం వద్దనైనా అపరిమిత ఉచిత లావాదేవీలను సదుపాయాన్ని అందిస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ డెబిట్ కార్డును ఉపయోగించి దేశంలోని ఏ ఏటీఎం వద్దనైనా, ఎన్నిసార్లైనా ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. సిటీ బ్యాంక్ కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది.
ఎస్బీఐలో కూడా అపరిమితం కానీ..
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ.. 2020 జులై 1న పునరుద్ధరించిన ఏటీఎం విత్‌డ్రా నియమాల ప్రకారం.. పొదుపు ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తున్న ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ గ్రూప్(ఎస్‌బీజీ) ఏటీఎంల వద్ద అపరిమిత ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంది.
రూ.1 లక్ష కంటే ఎక్కువ నెలవారీ సగటు బ్యాలెన్స్ నిర్వహించే వారికి ఎస్‌బీఐ గ్రూప్ ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద కూడా అపరిమిత ఉచిత లావాదేవీలకు వీలుంది.
ఇవీ చదవండి: