దేశంలో జియో రాకతో ప్రజల్లో డేటా విప్లవం మొదలైందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారత్ డిజిటల్ సమాజంగా మారేందుకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే సత్తా భారత్‌కు ఉందన్నారు.
ముంబయిలో మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఫ్యూచర్ డీకోడెడ్ సీఈఓ సదస్సులో పాల్గొన్నారు అంబానీ. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో చర్చాగోష్టిలో పాల్గొన్నారు.
"2014లో ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫలితంగా జియో అందించిన 4జీ సాంకేతికతను 38 కోట్ల మంది అందిపుచ్చుకున్నారు. జియోకు ముందు డేటా వేగం 256 కేబీపీఎస్‌గా ఉండేది. ప్రస్తుతం 21 ఎంబీపీఎస్‌కు చేరింది."
-ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత
దేశంలో పర్యటిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త భారత్‌ను చూస్తారని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. గతంలో పర్యటించిన అగ్రరాజ్యాధిపతులు జిమ్ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా చూసిన నాటి భారత్ కాదని.. అప్పటి పరిస్థితులకు పూర్తి భిన్నమని పేర్కొన్నారు.
సొంత సాంకేతికత...
భారత సీఈఓలు సొంత సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు నాదెళ్ల. పరిష్కారాలు కూడా అందులో భాగం కావాలన్నారు. డిజిటల్ ఉత్పత్తులు ఉత్పాదకతను పెంచుతాయన్నారు.