అంతకంతకూ నష్టాల్లో కూరుకుపోతున్న ఎయిర్ ఇండియా ప్రభుత్వ సాయంతో మాత్రమే ఎగరగలుగుతోంది. 2011-12 నుంచి రూ.30,000 కోట్లు చొప్పించినా, ప్రయోజనం లేకపోవడంతో, విక్రయించాలనే కచ్చిత నిర్ణయానికి వచ్చింది. అయితే అలవికాని షరతులు ప్రకటించడంతో, 2018 నుంచి ప్రయత్నిస్తున్నా ఎయిర్ ఇండియాను కొనేందుకు ఏ సంస్థా ముందుకు రాలేదు. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం, కూడా వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తోంది. ఆస్తులతో సహా ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటా విక్రయానికి ఈ ఏడాది జనవరి 27 నుంచి తీవ్రంగా యత్నిస్తూ, బిడ్ల దాఖలుకు గడువును ఇప్పటికి 4 సార్లు పొడిగించి, అక్టోబరు 30గా చేసింది. అర్హత కలిగిన బిడ్డర్లకు సమాచారం ఇచ్చే గడువును నవంబరు 20గా నిర్ణయించారు. ప్రవాస భారతీయులు 100 శాతం వాటా కొనుగోలుకు వీలు కల్పించినా, దేశీయ సంస్థకే మెజారిటీ వాటా, యాజమాన్య హక్కులు ఉండాలనే షరతు మాత్రం ఉంచింది. అంటే 49 శాతం వాటాను విదేశీ సంస్థలు అట్టేపెట్టుకుని, దేశీయ భాగస్వామ్య సంస్థకు 51 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. హిందూజా గ్రూప్, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ సంస్థలు ఎయిర్ ఇండియాపై ఆసక్తి చూపుతున్నాయని సమాచారం.
కలిసొస్తుందా?
కొవిడ్ మహమ్మారి ప్రభావంతో ప్రయాణాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ విమానయాన సంస్థలూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, దివాలా తీస్తున్నాయి. ఎయిర్ ఇండియా కూడా రోజూ రూ.30 కోట్లకు పైగా నష్టపోతోందని అంచనా.
- ఎయిర్ ఇండియాకు సంబంధించినంత వరకు విదేశీ సర్వీసుల నిర్వహణకు వివిధ దేశాలతో ఉన్న ఒప్పందాలు, ప్రధాన విమానాశ్రయాల్లో ఉన్న స్లాట్లు (విమానాలు దిగి, ఎగిరేందుకు కేటాయించే సమయాలు) అత్యంత ఆకర్షణీయ అంశం. ఒకరకంగా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే సంస్థకు ఇది బంగారుబాతు లాంటిదే.
- దేశీయ మార్గాల్లో చూస్తే, తక్కువ ధరల్లో ప్రయాణాలకే ఆదరణ లభిస్తోంది. సామర్థ్యాన్ని సజావుగా వినియోగించుకోగలిగితేనే లాభాలు ఆర్జించే వీలుంటుంది. ఇందువల్లే విదేశీ సంస్థలేవీ భారత్‌లో విమానయాన సంస్థలను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపడం లేదు. జెట్ ఎయిర్‌వేస్ విషయంలోనూ ఇది రుజువైంది.
- ఎయిర్ ఏషియా బెర్హాద్‌తో కలిసి చౌకధరల ఎయిరేషియా ఇండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి పూర్తిస్థాయి విమానయాన సంస్థ విస్తారాను టాటా నిర్వహిస్తోంది. ప్రభుత్వ తాజా షరతు ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాలో, ఎయిర్ ఏషియా ఇండియాను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో టాటా గ్రూప్ విలీనం చేయాల్సి ఉంటుంది. ఇందుకు భాగస్వామ్య సంస్థలు అంగీకరిస్తాయా అనేది చూడాలి.
- 2018లో జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు చేసే విషయంలో విస్తారా ముందడుగు వేయలేకపోవడం తప్పిదమేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మళ్లీ ఎయిర్ ఇండియా విషయంలో ఆ పొరపాటు చేయకపోవచ్చని అంటున్నాయి.
ఎయిరిండియా గమ్యస్థానాలు
- 52 దేశీయంగా..
- 42 విదేశాలకు
- 146 విమానాలు
రుణం, సిబ్బందిలో కోత
146ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న రూ.60,000 కోట్ల రుణంలో రూ.23,000 కోట్ల భారాన్ని కొనుగోలు చేసిన సంస్థ భరించాల్సి ఉంటుంది. మిగిలిన రుణాన్ని ప్రత్యేక ఖాతా (ఎస్‌పీవీ)కి బదిలీ చేసి, ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. అయితే రుణభారమంతా ప్రభుత్వమే వహించాలని తాజాగా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు సంస్థలు చెల్లించాల్సిన రూ.25,000 కోట్లలో రూ.9,700 కోట్లు నూతన యాజమాన్య బాధ్యత అవుతుంది. అంటే మొత్తం రుణంలో 61% ప్రభుత్వమే వహించనుంది.
146సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల సిబ్బంది అంటే ఉత్పాదకత తక్కువగా ఉంటుందనే భయం కొనుగోలుకు ఆసక్తి చూపే ప్రైవేటు సంస్థల్లో ఉంటుంది. అందువల్లే కొనుగోలు చేసిన సంస్థ ఏడాదిపాటు సిబ్బందిని తొలగించకూడదనే షరతును ఉంచుతారు. ఎయిర్ ఇండియాలో ఉన్న 9,426 మంది శాశ్వత సిబ్బందిని సాధ్యమైనంత తగ్గించి, కొత్త సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే వేతనం కూడా లేని సెలవును కొంతమందికి అమలు చేస్తోంది. వీరికి సెలవును 6 నెలల నుంచి అయిదేళ్ల పాటు అమలు చేసే అధికారం ఎయిర్ ఇండియా సీఎండీకి బోర్డు బదలాయించింది కూడా. సామర్థ్యం కలిగిన కొనుగోలుదార్లు ముందుకు వచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది. ఈ ఏడాది ఆఖరులోపు ఎయిర్ ఇండియా విక్రయం పూర్తిచేయాలనే దృక్పథంతో ఉన్నట్లు పౌరవిమానయాన మంత్రి చెబుతున్నారు కూడా. పెట్టుబడుల ఉసంహరణకు సంబంధించి నేడు జరిగే కార్యదర్శుల సమావేశంలో ఎయిర్ ఇండియాపైనా కీలక నిర్ణయాలు ఉండొచ్చని ఆశిస్తున్నారు.