రిలయన్స్ కమ్యునికేషన్(ఆర్‌కామ్) స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకొని ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ.. రిలయన్స్ జియోను ఏజీఆర్ బకాయిలు చెల్లించాలని ఎందుకు అడగటం లేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్‌కామ్‌కు సంబంధించిన సంవత్సరంవారీ బకాయిలు కోర్టుకు సమర్పించాలని కేంద్ర టెలికాం శాఖను ఆదేశించింది.
ఆర్‌కామ్ ఎప్పటి నుంచి బకాయిలు చెల్లించడం లేదో తెలిపే వివరాలను తమకు అందజేయాలని టెలికాం శాఖకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తీర్పు ఇచ్చేందుకు ఇవే కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. అనంతరం వాదనలు ఆగస్టు 18కి వాయిదా వేసింది.
మంత్రిత్వ శాఖల మధ్య అభిప్రాయబేధం
మరోవైపు, దివాలా సమయంలో స్పెక్ట్రమ్ అమ్మకాలపై రెండు మంత్రిత్వ శాఖల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దివాలా సమయంలో స్పెక్ట్రమ్ అమ్మకాలు జరపకూడదని టెలికాం శాఖ చెబుతుంటే.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాత్రం విలువ పెంచేందుకు స్పెక్ట్రమ్ అమ్మకాలకు అనుమతించాలని స్పష్టం చేస్తోందని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
అయితే స్పెక్ట్రమ్ పంచుకోవడం వ్యాపార ధోరణికి భిన్నమైనదని మెహతా పేర్కొన్నారు. వినియోగదారులు ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని చెప్పారు. ఏజీఆర్ బకాయిల రికవరీ కోసం సుప్రీంకోర్టు అభిప్రాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. స్పెక్ట్రమ్‌ను టెలికాంకు కాంట్రాక్టు పద్ధతిలో వినియోగానికి అనుమతించడం జరుగుతుందని గానీ యాజమాన్యం బదిలీ కాదని తెలిపారు. స్పెక్ట్రమ్ ఎప్పుడూ దివాలా ప్రక్రియకు సంబంధించనది కాదని స్పష్టం చేశారు. 'స్పెక్ట్రమ్ సహజ వనరు. దీనికి ప్రజలే యజమానులు. ప్రభుత్వం ట్రస్టీగా వీటిని నియంత్రిస్తుంది.' అని కోర్టుకు విన్నవించారు.
జియో వాదనలు
జియో తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. తమ సంస్థ దివాలా కోడ్ ప్రకారం ఎలాంటి ప్రక్రియలు చేపట్టడం లేదని కోర్టుకు తెలిపారు. ఆర్‌కామ్ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకొవడం లేదని స్పష్టం చేశారు.