రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలనుకునే వారికి షాక్ ఇస్తూ తమ బైక్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. మోడళ్ల వారీగా రూ.4,500 నుంచి రూ.8,000 వరకు ధర పెరిగినట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ల ధరలు పెరగటం ఈ ఏడాది ఇది మూడో సారి. చివరి సారిగా ఏప్రిల్లో.. రూ.10,000 వరకు ధరలు పెంచింది కంపెనీ.
ముడి సరకు వ్యయాల పెంపు వంటి కారణాలతో బైక్ల ధరల పెంపునకు రాయల్ ఎన్‌ఫీల్డ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంతో బజాజ్ ఆటో, మారుతీ, మహీంద్రా వంటి కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి.
మోడళ్ల వారీగా పెరిగిన ధరలు ఇలా..
బుల్లెట్ 350 బైక్ ధర ఇంతకు ముందు రూ.1.34 లక్షల నుంచి రూ.1.55 లక్షల మధ్య ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ.1.39-1.60 లక్షలకు చేరింది.
మీటియర్ 350 బైక్ ఇకపై రూ.1.92-2.08 లక్షలుగా ఉండనుంది. ఇంతకు ముందు ఈ బైక్ ధర రూ.1.84-2 లక్షలుగా ఉండేది.
హిమాలయన్ బైక్ ధర రూ.2.01-2.09 లక్షల నుంచి రూ.2.06-2.13 లక్షలకు పెరిగింది.
ఇంటర్సెప్టర్ 650 బైక్ ధర రూ.2.75-2.97 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు ఆ ధర రూ.2.81-3.04 లక్షలకు చేరింది.
కాంటినెంటర్ జీటీ 650 బైక్ ధరను రూ.2.98-3.20 లక్షలకు పెంచింది రాయల్ ఎన్‌ఫీల్డ్. ఇంతకు ముందు ఈ ధర రూ.2.92-3.13 లక్షల మధ్య ఉండేది.
![Royal Enfield Continental GT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12442808_ontinental.jpg)
ఇదీ చదవండి:Apple Days Sale: తక్కువ ధరకే ఐఫోన్లు- లిమిటెడ్ ఆఫర్!