దేశంలో కురుస్తున్న అకాల వర్షాల ధాటికి టమాట ధరలకు రెక్కలొచ్చాయి. కోల్కతాలో కిలో టమాటాల ధర (Tomato rate today) రూ.93కి చేరింది. చెన్నైలో కేజీ టమాట ధర రూ.60 పలుకుతుండగా.. (Tomato price in Delhi) దిల్లీలో 59, ముంబయిలో రూ.53కి చేరింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 50 నగరాల్లో టమాటాల సగటు ధర కేజీకి రూ.50 దాటింది.
హోల్సేల్ మార్కెట్లలోనూ టమాటాలు అధిక రేటు పలుకుతున్నాయి. టమాట హోల్సేల్ ధరలు (Tomato price today) కోల్కతాలో రూ.84, చెన్నైలో రూ. 52, ముంబయిలో రూ. 30, దిల్లీలో రూ.29.5గా ఉన్నాయి.
టమాటాలు అధికంగా పండే రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాల వల్లే రేట్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో వర్షాలకు పంట దెబ్బతింది. మండీలకు కూడా నాణ్యమైన టమాటాలు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. టమాటాలు అధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో.. ప్రస్తుతం ఈ పంట ప్రారంభ దశలో ఉంది.
రెండో స్థానంలో మనమే
ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా టమాటాలు (Largest producer of Tomatoes) పండించేది భారతదేశమే. 7.89 లక్షల హెక్టార్లలో సుమారు 19.75 మిలియన్ టన్నుల టమాటాలను భారత్ పండిస్తోంది. హెక్టారుకు సగటున 25.05 టన్నుల దిగుబడి వస్తోంది.
ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం- మరింత దిగిరానున్న ఉల్లి ధరలు!