ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్‌లోనూ ఇది విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య ఇక్కడ 34కి చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై పటిష్ఠ చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ‘రిలయన్స్ జియో’ కూడా కొవిడ్-19పై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓ కాలర్ ట్యూన్‌ను రూపొందించింది. నేటి నుంచే దీనిని వినియోగదారులకు ఉచితంగా అందించనుంది.
కరోనాపై అవగాహన
ఏ నెట్‌వర్క్ నుంచైనా జియోకు కాల్ చేస్తే ఈ ఉచిత కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. కరోనాకు సంబంధించి ఆరోగ్య సలహాలు, సూచనలతోపాటు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించిన తాజా సమాచారం ఈ కాలర్ ట్యూన్ ద్వారా అందించనున్నారు. కరోనాకు సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్లను కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కరోనా బాధితులతోపాటు ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు.
ఈ ఆటోమెటిక్ కాలర్ ట్యూన్‌ను ఏ జియో వినియోగదారుడైనా ఉచితంగా పొందొచ్చు. అయితే ఇప్పటికే తమకు నచ్చిన కాలర్ ట్యూన్లను ఎంపిక చేసుకున్నవారికి మాత్రం ఇవి లభించవు. కరోనాపై అవగాహన కల్పించేందుకు నిన్న ముంబయికి చెందిన హాప్టిక్ అనే స్టార్టప్ ఇదే తరహాలో వాట్సాప్‌పై ఆటోమెటెడ్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇదీ చూడండి: స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యారా? బయట పడండిలా