2021 మార్చిలో ప్రయాణికుల వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య(ఫాడా) తెలిపింది. గతేడాది ఇదే నెలలో 2,17,879 వాహనాలు అమ్ముడవ్వగా.. ఈ మార్చిలో 2,79,745గా నమోదైనట్లు వెల్లడించింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో అమ్మకాలు తగ్గినా.. మొత్తంగా 28.39 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఇక ద్విచక్రవాహన రిజిస్ట్రేషన్లు 35 శాతం తగ్గినట్లు 'ఫాడా' గణాంకాల్లో పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఉన్న 1,482 ఆర్టీఓ కార్యాలయాల్లో 1,277 నుంచి సేకరించిన సమాచారాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా)విడుదల చేసింది.
ఫాడా నివేదికలోని కీలక అంశాలు..
- ద్విచక్ర వాహనాల అమ్మకాలు గత నెలలో 35.26 శాతం క్షీణించాయి. 2021 మార్చిలో 11,95,445 యూనిట్లు అమ్ముడవగా.. ఆ సంఖ్య 2020 మార్చిలో 18,46,613గా ఉంది.
- వాణిజ్య వాహనాల అమ్మకాల్లోనూ భారీ తగ్గుదల కనిపించింది. వీటి అమ్మకాలు 42.2 శాతం క్షీణించి 67,372 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో 1,16,559 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- త్రీ-వీలర్ అమ్మకాలు 50.72 శాతం తగ్గి 38,034 యూనిట్లగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది 77,173 వాహనాలు అమ్ముడయ్యాయి.
- ట్రాక్టర్ విక్రయాలు మాత్రం పుంజుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 29.21 శాతం పెరిగి 69,082 యూనిట్లకు చేరుకున్నాయి. గత మార్చిలో 53,463 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి.
- మొత్తంగా అన్ని కేటగిరీలలో కలిపి వాహనాల రిజిస్ట్రేషన్లు 2020 మార్చి (23,11,687)తో పోలిస్తే 2021 మార్చిలో 28.64 శాతం తగ్గి 16,49,678 మాత్రమే నమోదయ్యాయి.
ఇవీ చదవండి: ఆశల పద్దు: 'తుక్కు పాలసీతో 'ఆటో'కు నయా జోష్
'