ఎస్ బ్యాంకు పునరుద్ధరణ పథకం ముసాయిదాను స్వీకరించామని ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ముసాయిదాకు తగిన విధంగా బ్యాంకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పునరుద్ధరణ పథకాన్ని పరిశీలించిన చాలా మంది సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులు ఎస్బీఐని సంప్రదిస్తున్నట్లు రజనీశ్ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విషయాలపై ఆయన మాట్లాడారు.
"మాకు ఎస్ బ్యాంకు పునరుద్ధరణ పథకం ముసాయిదా అందింది. మా పెట్టుబడులు, న్యాయనిపుణుల బృందాలు దానిపై కృషి చేస్తున్నాయి. ఎస్ బ్యాంకులో 49 శాతం వాటాలు కొనేందుకు అవసరమైన అంశాలను పరిశీలిస్తున్నాయి. ఈ విషయమై స్టాక్ ఎక్స్ఛేంజికి సమాచారం ఇచ్చాం. తమ డబ్బు విషయంలో డిపాజిటర్లకు ఎలాంటి భయం అక్కర్లేదు. "
- రజనీశ్ కుమార్, ఎస్బీఐ ఛైర్మన్
ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి మార్చి 9న ఆర్బీఐకి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని రజనీశ్ స్పష్టం చేశారు.
ఇదీ పునర్నిర్మాణ పథకం..
ఎస్ బ్యాంక్ లిమిటెడ్ పునరుద్ధరణ పథకం- 2020 ముసాయిదాను ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. దాని ప్రకారం.. వ్యూహాత్మక పెట్టుబడిదారు బ్యాంకు 49 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది. రూ.10 తక్కువకు కాకుండా షేరును కొనాల్సి ఉంటుంది. ప్రీమియం రూ.8 వరకు ఉండొచ్చని ఆ ముసాయిదాలో తెలిపింది.
మూలధనం వచ్చిన తేదీ నుంచి మూడేళ్ల లోపు ఆ వాటా 26 శాతంలోపు చేరడానికి వీలులేదు. అదే సమయంలో బ్యాంకు అధీకృత మూలధనం రూ.5,000 కోట్లుగా ఉంటుంది. రూ.2 ముఖ విలువ గల 2400 కోట్ల ఈక్విటీ షేర్లుంటాయి. ఈ ముసాయిదాపై అందరి అభిప్రాయాలను మార్చి 9 వరకు స్వీకరిస్తారు.
ఇదీ చూడండి: 'దివాలా స్మృతితో మారిన ఆలోచనలు-పెరిగిన రుణ వసూళ్లు'