తళుకులీనే రూపం.. రంగుల్లో వైవిధ్యం.. సెకన్ల వ్యవధిలోనే అనూహ్య వేగం అందుకోగలిగే ఇంజిను సామర్థ్యం అత్యాధునిక వాహనాల సొంతం.. అలాంటి బండ్లకు వాడే ఇంధనమూ ప్రత్యేకంగానే ఉంటుంది కదా! రాజధాని రహదారులపై వాయువేగంతో పోటీపడుతూ దూసుకెళ్లే ఆ రకం వాహనాల కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆక్టేన్ ఇంధనం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది.
విక్రయాలను ఆరంభించిన కేంద్ర మంత్రి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఎక్స్‌పీ 100 పేరుతో ఈ ప్రత్యేక ఇంధనాన్ని విక్రయిస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, కోల్‌కతా, కొచ్చి, ఇండోర్ నగరాల్లో శుక్రవారం నుంచి ఆక్టేన్ పెట్రోలు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భువనేశ్వర్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఈ ఏడు నగరాల్లో ఆధునిక పెట్రోలు విక్రయాలను శుక్రవారం ఆరంభించారు.
హైదరాబాద్ లో ఎక్స్‌పీ100 ధరెంతంటే..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంత ఐవోసీ బంకుల్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా దిల్లీ, నొయిడా, ఆగ్రాలతో పాటు మరో తొమ్మిది నగరాల్లో గత నెల ఒకటో తేదీన ఈ పెట్రోలు విక్రయాలు ఆరంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఎక్స్‌పీ 100 పెట్రోలు లీటరు ధర రూ.159గా ఐవోసీ నిర్ణయించింది.
క్షణాల్లో పుంజుకునే వేగం..కాలుష్యానికి ముకుతాడు
అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లు, ద్విచక్ర వాహనాలు ఈ పెట్రోలును వినియోగించటం ద్వారా క్షణాల్లో వేగాన్ని పుంజుకుంటాయి. మైలేజీ పెరుగుతుందని, కాలుష్యకారకాలకు ముకుతాడు పడుతుందని ఐవోసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ శ్రావణ్ ఎస్ రావు ‘ఈనాడు’తో చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తమ పరిశోధనా కేంద్రం ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.
లగ్జరీ బండ్లకు మరింత కిక్
విలాసవంతమైన కార్లు, బైకులు రాష్ట్రంలో ఏటా సగటున 4,500 నుంచి 5,000 వరకు నమోదవుతున్నట్లు రవాణా శాఖ వద్ద సమాచారం ఉంది. అతి ఖరీదైన రోల్స్‌రాయిస్, లంబోర్ఘని, బెంట్లీ, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, బీఎండబ్ల్యూ తదితర కార్లతో పాటు హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్, కవసకి, డుకాటీ, బీఎండబ్ల్యూ తదితర ద్విచక్ర వాహనాలు హైదరాబాద్ రోడ్లపై కనిపిస్తుంటాయి. పదేళ్లుగా విలాసవంత వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయని వాహన విక్రయదారు ఒకరు చెప్పారు. నగరంలో నమోదవుతున్న ఇలాంటి వాహనాలను, వాటి యజమానులకు గుర్తించి ఐవోసీ తాము ప్రవేశపెడుతున్న ప్రత్యేక ఇంధనం గురించి లేఖల ద్వారా వారికి సమాచారం అందించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణానికి కారణమైతే పదేళ్ల జైలు!