టెక్నాలజీలో వినూత్న ఆవిష్కరణలతో దూసుకెళ్తోన్న ఐఫోన్లలో కొత్త మోడళ్లు వచ్చేశాయి. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో నూతన శ్రేణి ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐ న్ 11 ప్రో మ్యాక్స్లను విడుదల చేసింది యాపిల్ సంస్థ.
తాజాగా భారత్‌లో ఈ ఫోన్ల ధరలను ప్రకటించారు యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిల్ స్కిల్లర్. భారత విపణిలో ఐఫోన్ 11 ధర రూ. 64,900 నుంచి ప్రారంభం కానుంది.
ఐఫోన్ 11 మొత్తం మూడు వేరియంట్లలో లభించనుంది. 64జీబీ వేరియంట్ ధర రూ. 64,900 కాగా.. 128 జీబీ వేరియంట్ ధర రూ. 69,900, 256జీబీ వేరియంట్ ధర రూ. 79,900గా నిర్ణయించింది.
ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ రూ. లక్షకుపైనే...
ఇక ఐఫోన్ 11 ప్రో ధర రూ. 99,900, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,09,900గా ఉండనున్నట్లు యాపిల్ వెల్లడించింది. ఇవి 64జీబీ, 256జీబీ, 512జీబీలలో లభ్యం కానున్నాయి. అమెరికా సహా ఇతర దేశాల్లో ఈ నెల 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవనుండగా.. భారత్‌లో మాత్రం సెప్టెంబరు 27 నుంచి కొత్త ఐఫోన్లు వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి.
ఫోన్లతో పాటు ఇతర గ్యాడ్జెట్లను కూడా యాపిల్ మంగళవారం ఆవిష్కరించింది. యాపిల్ వాచ్ సిరీస్ 5(జీపీఎస్) ధర రూ. 40,900 నుంచి, వాచ్ సిరీస్ 5(జీపీఎస్ + సెల్యూలార్) ధర రూ. 49,900 నుంచి ప్రారంభం కానుంది. యాపిల్ టీవీ ప్లస్ సేవల నెలవారీ చందాను రూ. 99గా నిర్ణయించారు.
ఇదీ చూడండి: 16 ఏళ్లకే ఇంగ్లీష్ ఛానల్ ఈదేసిన భారతీయురాలు!