అక్షయ తృతీయ, దంతేరాస్ సమయాల్లో బంగారం విక్రయాలు జోరుగా సాగుతాయి. దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంటాయి. కానీ ఈ ఏడాది మునుపటి మెరుపులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ సారి దంతేరాస్, దివాళీకి గతేడాదితో పోలిస్తే కనీసం 30 శాతం వరకు అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు.
''బంగారం ధరలు గత నెలలో 10 గ్రాములకు రూ. 40వేల పైకి చేరాయి. ఫెస్టివల్ సీజన్ ఆరంభంలోనే పెరిగిన ధరలు.. ఇంకా అధికంగానే ఉన్నాయి. ఇది వినియోగదారుల మనోభావాలపై మరింత ప్రభావం చూపే అవకాశముంది. ఈ వారంలో ఒకవేళ ధరల్లో ఏమైనా మార్పు కనిపిస్తే.. రిటైల్ అమ్మకాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. అయినప్పటికీ మొత్తంగా చూసుకుంటే.. గతేడాదితో పోలిస్తే 30 శాతం వరకు అమ్మకాలు క్షీణించే అవకాశముంది.''
- అనంత పద్మనాభన్, ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్
ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ. 38 వేల వద్ద కొనసాగుతోంది.
దిగుమతి సుంకాల పెంపు..
బంగారం దిగుమతులపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో పెంచింది. గతంలో 10 శాతంగా ఉన్న సుంకాన్ని 12.5 శాతంగా చేసింది. ఈ పరిణామంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. సాధారణ రోజుల్లో అమ్మకాలు భారీగా పడిపోయాయి. భారీగా ఉన్న బంగారం ధరలతో పెట్టుబడి పెట్టడానికీ ఎవరూ సుముఖత చూపడం లేదని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ తగ్గిందని చెబుతున్నారు.
పండగ రోజుల్లోనూ..
పండగ రోజుల్లో అమ్మకాలు అంతంత మాత్రమే ఉన్నాయని వర్తకులు పేర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబర్ 81.71 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా.. ఈ ఏడాది 26 టన్నులు మాత్రమే దిగుమతి చేసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలూ దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఔన్స్ బంగారం ధర సుమారు 250 డాలర్ల మేర పెరిగింది. దీంతో బంగారం దిగుమతులు గతంతో పోలిస్తే భారీగా తగ్గుతున్నాయి.