Microsoft Fourth Data Center in Hyderabad : హైదరాబాద్‌లో రూ.15 వేల కోట్ల భారీ పెట్టుబడితో నూతన డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకొచ్చింది. రాబోయే పదిహేనేళ్ల కాలంలో పూర్తి కానున్న ఈ డేటా సెంటర్.. మైక్రోసాఫ్ట్ కు దేశంలోనే అతిపెద్ద డేటాసెంటర్‌గా నిలుస్తుందని కంపెనీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ప్రకటించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని తమ క్యాంపస్‌లో కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
ఐటీ రంగంలో రెండంకెల వృద్ధి..
పుణే, ముంబయి, చెన్నై నగరాల్లో మైక్రోసాఫ్ట్‌కు ఇప్పటికే మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో రానున్న ఈ నాల్గో డేటా సెంటర్ 2025 కల్లా ఫేజ్ వన్ పూర్తవుతుందని అనంత్ మహేశ్వరి తెలిపారు. దేశ డిజిటల్ అవసరాలు పెరుగుతోన్న నేపథ్యంలో క్లౌడ్, డేటా సెంటర్ల వినియోగానికి విస్తృత ప్రాధాన్యం ఏర్పడిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఏటా ఈ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని.. దేశ క్లౌడ్, డిజిటల్ అవసరాలను తీర్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావటం హర్షణీయమని కేంద్రమంత్రి అన్నారు.
పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడింగ్లో విస్తృత అవకాశాలు
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ ఎగుమతుల్లో గతేడాదితో పోలిస్తే 12.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడింగ్లో విస్తృత అవకాశాలున్నాయని.. మైక్రోసాఫ్ట్‌లా కంపెనీలు వాటిని అందిపుచ్చుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్