స్టాక్ మార్కెట్ అంటేనే నష్టాల మూట అని జడిసిపోతూ ఉంటారు మనలో చాలామంది. దానిపై పూర్తి అవగాహన లేకపోవడం.. పెట్టిన డబ్బుల మీద వెంటనే భారీగా లాభాలొచ్చేయాలని అత్యాశకు పోవడమే ఇందుకు కారణం. మరి స్టాక్ మార్కెట్లో విజయవంతమైన వ్యక్తులు ఉన్నారా..? అని ప్రశ్నిస్తే.. ఎందుకు ఉండరు. కచ్చితంగా ఉంటారు. కాకపోతే వారు వెలుగులోకి రాకపోవచ్చు. మార్కెట్ అంటే నష్టాలకు రహదారి కాదని.. ప్రణాళికాబద్ధంగా.. వ్యూహాత్మకంగా.. ముందుకు సాగితే లాభాలు పూయించడం ఖాయమని చెప్పొచ్చు. ఇలా ఎదిగిన వ్యక్తులను పరిచయం చేసేదే ఈ ‘మార్కెట్ మహరాజా’.
విత్తనం వేశాక అది ఎప్పుడు కాస్తుందా...? అని ఎదురుచూస్తూ ఉంటాం. అలా రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. కొన్నాళ్లకు మన నిరీక్షణ ఫలించి పిందెలు దిగుతాయి. హమ్మయ్య పిందెలు వచ్చాయి కదా అని వాటిని కోసేయలేం కదా..!! అన్నాళ్లు ఓపికపట్టిన వాళ్లం మరికొన్నాళ్లు ఆగితే చక్కటి పళ్లు చేతికొస్తాయి. అప్పుడే మన ఓర్పు, శ్రమకు తగిన ఫలితం దక్కినట్లు. స్టాక్ మార్కెట్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. మనం పెట్టిన పెట్టుబడి మీద కొన్నాళ్లకు కొద్దిగా లాభాలు వచ్చాయి కదా అని సంబరపడిపోకూడదు. చాలామంది చేసే తప్పు ఇదే అంటున్నాడో గుజరాతీ డాక్టరు. ఎందుకంటే అతను ఇలాంటి తప్పే చేశాడు కాబట్టి. ఆ తప్పు దిద్దుకున్న సదరు డాక్టరు తర్వాతి కాలంలో ఓ విజయవంతమైన మదుపరి అయ్యాడు. అదెలాగో చూద్దామా..
విజయవంతమైన మదుపరిగా..
డాక్టరు కావాల్సింది పొరపాటున యాక్టరయ్యానంటూ కొంతమంది సినీతారలు చెప్పడం మనం వినే ఉంటాం కానీ, ఈ గుజరాతీ పెద్దమనిషి డాక్టరుగా రాణిస్తూనే.. విజయవంతమైన మదుపరిగా ఎదిగారు. వైద్యం, స్టాక్ మార్కెట్ ఈ రెండూ పరస్పరం భిన్న రంగాలు. అయినా రెండింటిలోనూ విజయవంతమైన ఆ డాక్టరు పేరు హితేశ్ పటేల్. పదిహేనేళ్ల క్రితం అంటే 2003లో ఆయన స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆయనకు షేర్లపై కనీస అవగాహన అనేదే లేదు. అయినా కానీ షేర్లను కొనేసి బాగానే నష్టపోయారు. ఒక్కసారి చేతులు కాలాక మళ్లీ దానిని తాకాలంటేనే భయమేస్తుంది. తనపై తనకు బలమైన నమ్మకం, ధైర్యం ఉంటే తప్ప ఆ సాహసం చేయలేరెవరూ.. అలాగని సాహసం చేసినంత మాత్రాన విజయం దక్కుతుందనీ అనుకోలేం. తగిన ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. తప్పుల నుంచి నేర్చుకోవడం అలవర్చుకోవాలి. నిత్య శిక్షణ ఉండాలి. వీటన్నింటినీ తూచా తప్పక పాటించడమే హితేశ్ విజయసూత్రమైంది.
తప్పటడుగులు తప్పవు..
స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టాక మొదట్లో తప్పుటడగులు తప్పవు. నష్టాలూ పలకరించక మానవు. 2003-08 మధ్య హితేశ్‌కు లాభమనే మాటే తెలియదు. దాంతో ఇలా కాదని స్టాక్ మార్కెట్‌పై అవగాహన పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. పెట్టుబడులకు సంబంధించిన పుస్తకాలు చదివేవారు. తనలాంటి అనుభవలేమి, మనస్తత్వం ఉన్న తోటి మదుపర్లను కలవడం.. వాళ్లతో తరచూ ఏదోక అంశంపై మాట్లాడటం చేసేవాడు. పెట్టుబడుల అవగాహన సదస్సులకూ హాజరయ్యేవారు. ఇలా కొంచెం కొంచెం జ్ఞానాన్ని సంపాదించి తనపై తనకు నమ్మకాన్ని పెంచుకున్నారు. ప్రఖ్యాత మదుపర్లు వారెన్ బఫెట్, పీటర్ లించ్‌లను తన మార్గదర్శకులుగా, గురువుగా భావించేవారు. వాళ్లు చెప్పిన సూత్రాలను పాటించేవారు. ఇప్పుడు ఏదేని ఒక షేరును కొనేముందు ఆ కంపెనీని పలు రకాల్లో అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటున్నారు. వ్యాపార నాణ్యత, యాజమాన్యం, బ్యాలెన్స్ షీట్లు, వృద్ధి అవకాశాలు ఇలా అన్నింటిని పరిశీలించడాన్ని ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఈ తత్వమే మంచి షేర్లను ఎంపిక చేసుకునేందుకు తనకు దారి చూపుతోందని హితేశ్ ఎప్పుడూ అంటుంటారు.
విజయయాత్ర ఎప్పుడంటే..
2010 నుంచి హితేశ్ విజయయాత్ర మొదలైందని చెప్పొచ్చు. ఆ ఏడాది కొనుగోలు చేసిన అజంతా ఫార్మా షేర్లు 2015 నాటికి 45 రెట్లు (4500%) ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. కావేరీ సీడ్ షేరుపై 5 రెట్లు, వీఎస్‌టీ టిల్లర్స్ షేరుపై 4 రెట్లు, కెన్‌ఫిన్ హోమ్స్ షేరుపై 12 రెట్లు లాభాన్ని పొందారు. బజాజ్ ఫైనాన్స్, డీసీఎం షేర్లు కూడా ఆయనకు మంచి ప్రతిఫలాన్ని పంచాయి. అయితే ఆచితూచి, జాగ్రత్తతో కొనుగోలు చేసినంత మాత్రాన మన షేర్లన్నీ లాభాలు తెచ్చిపెట్టవు కదా. హితేశ్ పోర్ట్‌ఫోలియోలో నష్టాలను ఆశ్రయించిన షేర్లూ ఉన్నాయి. రేణుకా షుగర్స్ తిరిగి గాడిన పడుతుందనే ఉద్దేశంతో ఆ కంపెనీ షేరును కొనుగోలు చేశారు. కానీ నష్టాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఏదేని ఒక షేరు నష్టాన్ని తెచ్చిపెట్టినప్పుడు.. అది ఎంత శాతమైనా కావచ్చు సాధ్యమైనంత త్వరగా దానిని అమ్మేసి బయటపడాలనే నియమాన్ని తాను సదా పాటిస్తానని చెబుతూ ఉంటారు హితేశ్. దీనివల్ల నష్టాన్ని తగ్గించుకోవడంతో పాటు.. ఇతర షేర్లపై మన దృష్టిని కొనసాగించేందుకు వీలుంటుందని అంటుంటారు. మధ్య తరహా, చిన్న కంపెనీల షేర్ల కొనుగోలుకు హితేశ్ ఎక్కువగా మొగ్గు చూపుతూంటారు. తద్వారా ఈ తరహా షేర్లపై ఆయన మంచి పట్టును కూడా సంపాదించారు.
ఇది చేయండి..
‘నువ్వు ఫలానా కంపెనీ షేరును ఎందుకు కొంటున్నావో నీకు నువ్వు ప్రశ్నించుకో. ఆ ప్రశ్నకు తగిన సమాధానాన్ని ఓ కాగితం మీద రాసుకో. ఆ సమాధానం నీకు సంతృప్తినిస్తేనే ఆ షేరును కొను.’ స్టాక్ మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టే వారికి హితేశ్ ప్రధానంగా ఇచ్చే సలహా ఇది. పెట్టుబడుల నైపుణ్యాన్ని నిత్యం పెంచుకుంటే అది మీరు తప్పకుండా విజయవంతమయ్యేందుకు ఉపయోగపడుతుందని ఆయన చెబుతుంటారు. నీ పెట్టుబడి విధానాన్ని నమ్ముకో కానీ ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మొద్దని అంటుంటారు.
ఇదీ చూడండి: బ్యాంకు ఖాతాలు ఎక్కువైనా నష్టమే.. ఎందుకంటే?