దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా (ఎం&ఎం) కీలక నిర్ణయం తీసుకుంది. 29,878 పికప్ వాహనాలను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా వాహనాల అసెంబ్లింగ్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది.
2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి మధ్య తయారైన పికప్ వాహనాల్లో మాత్రమే ఇలాంటి లోపం ఉన్నట్లు తెలిపింది ఎం&ఎం. రీకాల్ చేసిన వాహనాలకు ఉచితంగానే కావాల్సిన మరమ్మతులు చేయనున్నట్లు పేర్కొంది. సంబంధిత వాహనాల వినియోగదారులను కంపెనీనే నేరుగా సంప్రదిస్తుందని కూడా స్పష్టం చేసింది.
ఇప్పటికే రెండు సార్లు రీకాల్..
ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు రీకాల్ ప్రకటించింది ఎం& ఎం. వివిధ మోడళ్ల డీజిల్ వేరియంట్లలో సమస్యలను సరిచేసేందుకు.. గత నెలలోనే 600 యూనిట్లను రీకాల్ చేసింది.
ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో 1,577 థార్ ఎస్యూవీలను రీకాల్ చేసి.. ఇంజిన్లో లోపాలను సరిచేసింది ఎం&ఎం.
టాటా నుంచి కొత్త మోడల్స్..
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఎస్యూవీ సెగ్మెంట్లోని హారియర్, సఫారీ మోడళ్లలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. హారియర్ ఎక్స్టీఏ+ ధరను రూ.19.14 లక్షలుగా, ఇదే మోడల్ డార్క్ ఎడిషన్ ధరను రూ.19.34 లక్షలుగా నిర్ణయించింది.
సఫారీ ఎక్స్టీఏ+ ధరను రూ.20.09 లక్షలుగా ఉంచింది టాటా మోటార్స్. (ధరలన్నీ దిల్లీ ఎక్స్ షోరూం ప్రకారం)
ఈ రెండు రకాల కొత్త వేరియంట్లలో 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్, సన్ రూఫ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
2 లీటర్ డీజిల్ ఇంజిన్, ప్రొజెక్టర్ హెడ్ల్యాప్, డ్యుయల్ ఫంక్షన్ ఎల్ఈడీ, ఆర్ 17 అల్లోయ్ వీల్స్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఈ మోడళ్లలో పొందుపరిచినట్లు టాటా మోటార్స్ పేర్కొంది.
ఇదీ చదవండి: గడువులోపు ఆ పని చేయకుంటే మీ ఎస్బీఐ అకౌంట్ క్లోజ్!