2019-20 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తమ నికర లాభం 45.4 శాతం పెరిగి రూ.990 కోట్లకు చేరుకుందని టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రకటించింది. తమ చందాదారుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జియో నికర లాభం రూ.681 కోట్లుగా ఉంది.
కంపెనీ నిర్వహణ ఆదాయం 33.7 శాతం పెరిగి రూ.12,354 కోట్లకు చేరింది. 2018-19లో ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.9,240 కోట్లుగా ఉంది.
"ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సేవల సంస్థగా నిలిచే క్రమంలో జియో 350 మిలియన్ చందాదారుల మార్కును దాటింది. ఇంకా ప్రతి నెలా 10 మిలియన్లకుపైగా కొత్త చందాదారులను చేర్చుకుంటున్నాం. జియో... చందాదారుల సంఖ్య, ఆదాయాల పరంగా భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. అంతే కాదు డిజిటల్ గేట్వే ఆఫ్ ఇండియా కూడా."
- ముఖేశ్ అంబానీ, రియలన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
ఒక జియో వినియోగదారునిపై ఆదాయం రూ.120గా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే మునుపటి త్రైమాసికంతో పోల్చితే రూ.2 మేర ఈ ఆదాయం తగ్గిందని పేర్కొంది. ఈ లోటును పెరిగిన చందాదారుల సంఖ్య అధిగమించిందని జియో తెలిపింది.
జియో చందాదారుల సంఖ్య గత త్రైమాసికంతో పోల్చితే 33.3 కోట్ల నుంచి నేడు 35.52 కోట్లకు చేరుకుంది.
ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థను మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారు'