చేతిలో డబ్బు లేకున్నా అవసరమైన ఖర్చుకు మాత్రం ఇబ్బంది లేకుండా చూస్తుంది క్రెడిట్ కార్డు. వీటిని ఎలా వినియోగించాలన్న విషయాన్ని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. రెండుమూడు క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు మీకు ఖర్చు పెట్టే శక్తి పెరుగుతుంది. వివిధ బ్యాంకుల నుంచి ఆ కార్డులు తీసుకుంటే.. అందే ప్రయోజనాలు కూడా అధికంగానే ఉంటాయి. కొన్ని బ్యాంకులు ఎక్కువ రివార్డు పాయింట్లు ఇస్తుంటాయి. మరికొన్నింటితో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు అదనపు రాయితీలు దొరుకుతుంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పుడు మిత్రుల దగ్గర్నుంచి అప్పు తీసుకోకుండా ఇవి సాయం చేస్తాయి.
ఖర్చు నిష్పత్తి తగ్గుతుంది...
ఒకే కార్డు ఉన్నప్పుడు ఖర్చంతా ఆ కార్డుపైనే చేయాలి. అప్పుడు ఆ కార్డు క్రెడిట్ పరిమితిని పూర్తిగా వినియోగించుకుంటున్నట్లు అవుతుంది. ఉదాహరణకు.. మీకు రూ.1,00,000 పరిమితితో ఒక కార్డు ఉందనుకుందాం. ఒక నెలలో రూ.40వేలు ఖర్చు చేస్తే మీ రుణ వినియోగ నిష్పత్తి (సీయూఆర్) 40శాతం ఉన్నట్లు. దీనివల్ల అధికశాతం క్రెడిట్ కార్డుపై ఆధారపడినట్లు కనిపిస్తుంది. క్రెడిట్ స్కోరును నిర్ణయించడంలో ఇదీ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు అధికంగా ఖర్చు చేస్తున్నారని తేలితే.. మీ క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంది. ఇలాంటప్పుడే రెండుమూడు క్రెడిట్ కార్డుల అవసరం పడుతుంది. పైన తెలిపిన ఉదాహరణలో మీరు ఒక కార్డుకు బదులుగా రెండు కార్డులు ఉపయోగించారనుకుందాం.. అప్పుడు ఒక్కో కార్డు నుంచి రూ.20వేలు ఖర్చు చేశారనుకుందాం. అప్పుడు మీ సీయూఆర్ ఒక్కో కార్డులో 20శాతం వరకే ఉంటుంది. తక్కువ సీయూఆర్ ఉన్నప్పుడే క్రెడిట్ స్కోరు పెరగడానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
రివార్డులు వస్తాయి..
ప్రస్తుతం చాలామంది ఆన్‌లైన్ కొనుగోళ్లకు అలవాటు పడ్డారు. ఆన్‌లైన్ దుకాణాల్లో ఒక్కోసారి ఒక్కో కార్డుపై డిస్కౌంట్లు ఇస్తుంటారు. ఉదాహరణకు ఒక క్రెడిట్ కార్డుతో కొంటే.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై రూ.8వేల వరకూ తగ్గింపు అని ప్రకటన వస్తుంది. ఇంకో కార్డుపై విమాన టిక్కెట్లలో డిస్కౌంటు అంటుంది. మరో కార్డు.. దుస్తులు కొనుగోలుపై తగ్గింపు ఇస్తానంటుంది.. కానీ, అన్ని కార్డులూ తీసుకోవడం మనవల్ల కాదు కదా! మీరు తరచూ ఆన్‌లైన్‌లో కొంటున్నారనుకోండి. ఏ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో తగ్గింపు వస్తుందో చూసుకొని, ఆ క్రెడిట్ కార్డు తీసుకునే ప్రయత్నం చేయాలి. విమాన ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటే.. క్రెడిట్ కార్డుతోపాటు, ట్రావెల్ కార్డు, ఎయిర్ ఇన్సూరెన్స్, విమానాశ్రయం లాంజీలోకి అనుమతిలాంటి వెసులుబాట్లు ఉన్నాయా చూడాలి. మీ అవసరం ఏమిటి? అందుకు ఎక్కువగా ఉపయోగపడే కార్డు ఏది అని చూసుకొని, తీసుకుంటే.. అధిక రివార్డులతోపాటు, బిల్లు భారం కూడా తగ్గించుకోవచ్చు.
అంతరాయం లేకుండా..
ఒక్కోసారి వస్తువులు కొన్న తర్వాత కార్డుతో చెల్లింపు చేయాలనుకున్నప్పుడు.. ఆ కార్డు పనిచేయకపోవచ్చు. చేతిలో డబ్బు లేకపోతే.. ఇబ్బందే కదా.. మీ దగ్గర రెండు మూడు కార్డులున్నాయనుకోండి.. ఒక కార్డు కాకపోతే మరోటి. ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఇది ఎంతో అవసరం కూడా.
ఎన్ని కార్డులుండాలి?
ఒక వ్యక్తికి ఎన్ని క్రెడిట్ కార్డులుండాలి? దీనికేమైనా సూత్రం ఉందా? అనే సందేహం రావచ్చు. నిజానికి ఒక వ్యక్తి తన అర్హత మేరకు కావాల్సినన్ని క్రెడిట్ కార్డులు తీసుకోవచ్చు. కానీ, మీ జీవన శైలి, ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి ఎన్ని కార్డులు అవసరం అన్నది మీకు మీరుగా నిర్ణయించుకోవాలి. ఒకే రకం ప్రయోజనాలు ఉన్న కార్డులను తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రతి కార్డు భిన్న ప్రయోజనాలను అందించాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కార్డులు ఎక్కువగా తీసుకోవడం కాదు.. కార్డులను నిర్వహించే క్రమశిక్షణా ముఖ్యమే. ప్రతి కార్డు బిల్లు గడువు తేదీ, బిల్లు చెల్లించకపోతే ఉండే రుసుములు, వడ్డీ, ఇతర ఛార్జీలపై అవగాహన ఉండాలి. లేకపోతే.. కార్డులు ఎక్కువై అందే ప్రయోజనాలకన్నా.. దుష్పరిణామాలే అధికంగా ఉంటాయి. బిల్లులు సరిగా చెల్లించకపోతే.. వడ్డీల భారంతో ఆర్థికంగా చిక్కుల్లో పడటం ఖాయం.
స్కోరు తగ్గకుండా..
కొత్తగా అప్పు తీసుకోవాలన్నా.. క్రెడిట్ కార్డు కావాలన్నా.. రుణ చెల్లింపుల చరిత్ర, క్రెడిట్ స్కోరు ఎంతో ప్రధానమన్నది తెలిసిందే. ఇది తగ్గకుండా ఉండాలంటే.. వెంటవెంటనే రుణాలకూ, క్రెడిట్ కార్డులకూ దరఖాస్తు చేయకండి. దీనివల్ల మీకు అప్పుల అవసరం ఎక్కువగా ఉందన్న భావనకు వస్తాయి బ్యాంకులు. క్రెడిట్ స్కోరు కూడా తగ్గుతుంది. బిల్లులన్నీ సకాలంలో చెల్లించడమూ ముఖ్యమే. దీర్ఘకాలంపాటు క్రెడిట్ కార్డు వాడుతూ.. ఆలస్యం చేయకుండా బిల్లులు చెల్లిస్తూ ఉంటే.. క్రెడిట్ స్కోరు పెరుగుతూనే ఉంటుంది.
(రచయిత-నవీన్ చందాని, చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్)