కొత్తగా పెళ్లి అయిన వారి దగ్గరి నుంచి చిన్న పిల్లలున్నవారు, వృద్ధులు ఎలాంటి పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుందో చూడండి.
మా పాప పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.2వేలు జమ చేస్తున్నాను. మరో రూ.2 వేలను పీపీఎఫ్‌లో జమ చేద్దామని అనుకుంటున్నాను. నష్టభయం లేకుండా ఉండాలనేది నా ఆలోచన. దీనికోసం నేను ఎలాంటి పథకాలను ఎంచుకోవచ్చు?
- సంధ్య
సుకన్య సమృద్ధి యోజన ఎలాంటి నష్టభయం లేని పథకం. రాబడిపైనా పన్ను ఉండదు. ప్రస్తుతం ఇందులో 7.6శాతం వడ్డీ లభిస్తోంది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) సైతం పూర్తిగా సురక్షితం. రాబడిపైనా పన్ను ఉండదు. వడ్డీ 7.1శాతం వస్తోంది. మీరు ఇప్పటికే సురక్షితమైన పథకం సుకన్య సమృద్ధిలో మదుపు చేస్తున్నారు కాబట్టి, కొత్తగా మదుపు చేయాలనుకుంటున్న రూ.2వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడికి అవకాశం ఉంది. ఇలా నెలకు రూ.4వేల పెట్టుబడిని కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేస్తే.. సగటు రాబడి 10.5శాతం చొప్పున రూ.15,86,881 అయ్యేందుకు వీలుంది.
మా అమ్మ పేరుమీద రూ.10లక్షలు డిపాజిట్ చేసి, ఏడాదికోసారి వడ్డీని వెనక్కి తీసుకోవాలన్నది ఆలోచన. దీనికోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాకుండా.. ఇతర పెట్టుబడి పథకాలేమైనా ఉన్నాయా?
- రాజేందర్
ప్రస్తుతం వడ్డీ రేట్లు చాలా స్వల్పంగా ఉన్నాయి. దీనివల్ల బ్యాంకు డిపాజిట్లపైన మనకు రూ.5-6శాతం వరకే వడ్డీ లభిస్తుంది. కాస్త అధికంగా వడ్డీ రావాలంటే..మీరు పోస్టాఫీసుటైం డిపాజిట్ అకౌంట్‌ను పరిశీలించండి. ఇందులో అయిదేళ్లు డిపాజిట్ చేస్తే ప్రస్తుతం ఉన్న వడ్డీ 6.7శాతం. ఇందులో ఏడాదికోసారి వడ్డీ చెల్లిస్తారు.
పన్ను ఆదా కోసం జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఏడాదికి రూ.లక్ష వరకూ మదుపు చేసుకోవచ్చా?ఏం చేస్తే బాగుంటుంది?
- ప్రదీప్
జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) మంచి పథకమే. రుసుములూ చాలా తక్కువగానే ఉంటాయి. సెక్షన్ 80సీ కిందా దీనిద్వారా పన్ను ఆదా అవుతుంది. ఒకవేళ సెక్షన్ 80సీలో ఇప్పటికే రూ.1,50,000 పూర్తయితే.. సెక్షన్ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ ఎన్‌పీఎస్ ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది.
నా వయసు 28 ఏళ్లు. ఇటీవలే వివాహం అయ్యింది. ఇద్దరమూ ఉద్యోగులమే. మా ఇద్దరి పేరుమీదా కలిపి ఉమ్మడిగా టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాం. ఇది సరైనదేనా.. విడివిడిగా రూ.కోటి విలువైన పాలసీ తీసుకోవడం మంచిదా?
- సాయి
* మీ ఇద్దరి పేరుపైనా బీమా పాలసీ తీసుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి. మీకు కావాల్సిన రక్షణను మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు మంచి కంపెనీలను ఎంచుకొని, వాటి నుంచి పాలసీలను తీసుకోండి. ఉమ్మడిగా కాకుండా విడివిడిగా పాలసీలు తీసుకోవడమే ఉత్తమం.
- తుమ్మ బాల్‌రాజ్
ఇదీ చూడండి: బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్!