Personal Accident Insurance: వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలను జీవితాంతం వరకు కొనసాగించేలా నిబంధనలను తీసుకొచ్చేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ముసాయిదాను విడుదల చేసింది. వయసును కారణంగా చూపించి, ఈ బీమా పాలసీ పునరుద్ధరణకు నిరాకరించకూడదని ఇందులో పేర్కొంది.
ఆరోగ్య బీమా పోర్టబులిటీకి నిర్ణీత సమయం: ఆరోగ్య బీమా పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలనుకున్నప్పుడు (పోర్టబులిటీ), దీనికోసం దరఖాస్తు చేసిన 5 రోజుల్లోగా కొత్త బీమా సంస్థ, పాత సంస్థ నుంచి సమాచారం తెప్పించుకోవాలనే నిబంధననూ ప్రతిపాదించింది. పాలసీదారుడి ఆరోగ్య వివరాలు, అప్పటివరకు చేసిన క్లెయింలు ఇందులో ఉంటాయి. పోర్టబిలిటీ నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని నియంత్రణ సంస్థ భావిస్తోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం దీనికి ఎలాంటి గడువూ లేదు. పాలసీదారులు తమ పాలసీ మొత్తాన్ని పెంచుకోకుండా.. గత పాలసీనే కొనసాగిస్తే.. ఎలాంటి వైద్య పరీక్షలు, కొత్తగా పాలసీ నిబంధనలు మార్చడంలాంటివి చేయొద్దనే నిబంధనలు తీసుకురానుంది. పాలసీదారుడి రిస్క్ ప్రొఫైల్ మారినప్పుడు ప్రీమియంలో రాయితీలు ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం బీమా సంస్థలు లోడింగ్ ప్రీమియాన్ని మాత్రమే తగ్గిస్తున్నాయి. బీమా సంస్థలు తమ అభిప్రాయాలను మార్చి 6లోగా తెలియజేయాలని సూచించింది.
ఇదీ చూడండి: కొత్తగా పెళ్లయిందా? బీమా, లోన్ విషయంలో ఇలా చేస్తే లాభాలెన్నో!