ఇటీవల బిట్ కాయిన్ విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటం వల్ల ఇతర దేశాల్లోలానే భారత్‌లోనూ ఈ క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. బిట్ కాయిన్‌పై పెట్టుబడుల పరంగా ఆసియాలో భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. అమెరికా, నైజీరియా, చైనా, కెనడా, బ్రిటన్ల తర్వాత మన దేశం ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వీటిలో పెట్టుబడులు పెట్టేప్పుడు జాగ్రత్త వహించాలని మదుపరులకు సూచిస్తున్నారు నిపుణులు. బిట్ కాయిన్ ఎక్కువ రిస్కుతో కూడుకున్నదని వారు చెబుతున్నారు. దీనిపై వచ్చే రాబడి కూడా అధికంగానే ఉంటుందంటున్నారు. బిట్ కాయిన్లో పెట్టుబడికి ఉన్న ప్రధాన రిస్కు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చట్టపరంగా...
బిట్ కాయిన్ల నిర్వహణ అనేది రిజర్వు బ్యాంకు కానీ, ఇతర చట్టపరమైన సంస్థల పరిధిలో కానీ లేదు. నియంత్రణ లేనందువల్ల.. బిట్ కాయిన్ పెట్టుబడులు గురించి ఆర్బీఐ కూడా పలు మార్లు హెచ్చరించింది. దీనిపై గతంలో నిషేధం కూడా విధించింది. అయితే ఆర్బీఐ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. 2020 మార్చిలో సుప్రీం కోర్టు బిట్ కాయిన్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది.
హెచ్చుతగ్గులు..
స్టాక్ మార్కెట్ల మాదిరిగానే బిట్ కాయిన్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ బిట్ కాయిన్లలో హెచ్చుతగ్గులు భారీ మొత్తంలో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే.. ఓకే రోజులో పెట్టుబడిదారులను అపర కుబేరులుగా మార్చగలదు.. వారి సంపద పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు.
భద్రత..
బిట్ కాయిన్ పూర్తి డిజిటల్ ఫార్మట్ లోనే ఉంటుంది. దీనివల్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనికి సరైన ఆధారం అనేది లేదని వారి వాదన.
ప్లాట్ ఫామ్..
చాలా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ బిట్ కాయిన్లలో పెట్టుబడులను స్వీకరిస్తున్నట్లు చెబుతున్నాయి. అయితే కేవైసీ, యాంటీ మనీ లాండరింగ్ మార్గదర్శకాలను అనుసరించే విశ్వసనీయమైన వాటి ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఏదైనా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టే ముందు.. వాటికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవాలి. అన్ని విధాలా వాకబు చేసుకుని మాత్రమే పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.