ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. తమ కలలకు కృషిని జోడించి ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల్లో కొందరు, వ్యాపారాలు స్థాపించి మరికొందరు తమ సత్తా చాటుతున్నారు. మహిళలు పురుషులతో సమానంగా ఉద్యోగ జీవితంలో రాణిస్తున్నారు. ఫలితంగా మధ్యతరగతి కుటుంబాల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. కానీ, ఈ ఆదాయాన్ని అనవసర ఖర్చులకు వృథా చేస్తే ప్రయోజనం ఏముంటుంది?
భవిష్యత్తు కోసం ఈ ఆదాయాన్ని సరైన మార్గంలో సక్రమంగా వినియోగించుకుంటేనే శ్రమకు రెట్టింపు ప్రయోజనం లభించేది. కాబట్టి మహిళలు ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించాలి. దీర్ఘకాల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పెట్టుబడి ప్రణాళికలు రచించుకోవాలి. తమ జీవితంలో ఇది కీలక లక్ష్యంగా మారాలి. దీనిపై దృష్టి పెట్టేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి...
ఆర్థిక స్వేచ్ఛ
పెట్టుబడి ప్రణాళిక మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకునే అతివలు.. తమ అవసరాలను సొంతంగానే తీర్చుకోగలిగేలా ఉండాలి. ఇందుకోసం మంచి రాబడినిచ్చే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం ఆరంభించాలి.
ఆర్థిక పరిస్థితులు, రిస్క్ ప్రొఫైల్, అందుబాటులో ఉన్న సమయాన్ని బేరీజు వేసుకొని.. వివిధ రకాల పెట్టుబడి ప్రణాళికలను అన్వేషించాలి. ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే అంతే వేగంగా ప్రతిఫలం అందుతుందన్న విషయాన్ని మరవకూడదు.
జీవిత లక్ష్యాలను సాధించేందుకు..
ఇప్పటి మహిళలకు ఎన్నో వృత్తిరీత్య, వ్యక్తిగత లక్ష్యాలు ఉంటున్నాయి. ప్రపంచాన్ని చుట్టేసి రావడమో, సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడమో.. కల ఏదైనా అందుకు కావాల్సింది డబ్బే. ఈ లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక సహకారం ఉండాలి. సరైన పెట్టుబడి ప్రణాళికలు ఉంటే అది సాధ్యమవుతుంది. ఇతరులపై ఆధారపడకుండా తమ లక్ష్యాలను సాధించే వీలుంటుంది.
ఒడుదొడుకుల్లో ఆసరాగా..
పురుషులతో పోలిస్తే మహిళల కెరీర్ ఒడుదొడుకులతో సాగుతుందన్న మాట వాస్తవం. పెళ్లి జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, లేదా జీవితభాగస్వామి వేరే ప్రాంతానికి బదిలీ అయినప్పుడు.. అంతిమంగా ప్రభావం పడేది మాత్రం మహిళలపైనే. ఇలాంటి సమయాల్లో కెరీర్‌కు చిన్న బ్రేక్ పడుతుంది. కొన్ని సార్లు తమ సామర్థ్యాలను పెంచుకోవడానికో, ఉన్నత చదువుల కోసమో ఉద్యోగానికి దూరమైన సందర్భాలూ ఉంటాయి. కెరీర్‌కు బ్రేక్ పడిందంటే.. ఆదాయమూ ఆగిపోయినట్లే.
ఇలాంటి సమయాల్లో సొంత కాళ్లపై నిలబడాలనుకుంటే.. మహిళలు తప్పనిసరిగా ఆర్థిక ప్రణాళికకు పదునుపెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూ ఉండాలి. పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం ఉద్యోగ విరామ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పదవీ విరమణ తర్వాత..
చాలా మంది మహిళలు పదవీ విరమణ తర్వాత తమ జీవిత భాగస్వామి సంపాదనపైనే ఆధారపడతారు. గృహిణులైనా, ఉద్యోగాలు చేసినవారిదైనా ఇదే పరిస్థితి. కానీ, సరైన పెట్టుబడి ప్రణాళిక ఉంటే.. రిటైర్మెంట్ జీవితం సొంత ఆదాయ వనరులతో సాఫీగా సాగిపోతుంది.
(రేష్మా బండ, బజాజ్ అలియాంజ్ లైఫ్)