మనుషుల ప్రాణాలు కాపాడేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించడం అవసరమేనని భారత పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కొవిడ్-19 కారణంగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థ పునర్ నిర్మాణానికి ఉద్దీపన పథకం అవసరమని భావిస్తున్నాయి. నేడు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ.. లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా సోకని ప్రాంతాలలో ఈ నెల 20 తర్వాత ఆంక్షలు సడలిస్తామని పేర్కొన్నారు.
రెండో దఫా ప్యాకేజీ అవసరం...
గత నెలలో కేంద్ర ప్రభుత్వం రూ.1.7 లక్షల కోట్లతో ఉద్దీపన పథకం ప్రకటించింది. ఇది పూర్తిగా పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసిదిగానే ఉంది. పారిశ్రామిక రంగాలకు ఆలంబనగా లేదు. ఈ నేపథ్యంలో రెండో ప్యాకేజీని ప్రకటించాలని వాణిజ్య సంఘాలు కోరుతున్నాయి.
'లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా రోజుకు రూ.40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. అంటే 21 రోజుల్లో మొత్తం రూ.7 నుంచి రూ.8 లక్షల కోట్లన్న మాట'
సంగీతా రెడ్డి, ఫిక్కీ అధ్యక్షురాలు
ఏప్రిల్-సెప్టెంబర్ 2020 త్రైమాసికానికి 4 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆమె పేర్కొన్నారు. తక్షణమే సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధానిని కోరారు. ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షలు సడలిస్తే వ్యాపారాలు మొదలవుతాయని ఆమె అంచనా వేశారు.
పరిశ్రమలకు మేలు..
కొవిడ్-19 వ్యాప్తి తగ్గాలంటే పటిష్ట చర్యలు అవసరమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. అందులో భాగంగానే ప్రధాని లాక్‌డౌన్‌ను పొడిగించారని తెలిపారు.
'ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షలు సడలిస్తామంటూ ప్రధాని లాక్‌డౌన్ ఎత్తివేత ప్రణాళిక గురించి చెప్పారు. పరిశ్రమలకు ఇది మేలు చేస్తుంది. ఆర్థిక వ్యవస్థను వ్యవస్థీకృతం చేసేందుకు, పరిస్థితులను చక్కదిద్దేందుకు పొడిగింపు కాలం ఉపయోగపడుతుంది. ఈ సమయంలో పరిశ్రమలు కూడా కొత్త వ్యూహాలు రచించుకోవాలి.'
-బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
ఇంకా ఎవరేమన్నారంటే?
లాక్‌డౌన్ పొడిగింపు కొవిడ్-19 కట్టడికి ఉపయోగపడుతుందన్న ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చెబుతున్నా.. లాక్‌డౌన్ తర్వాత తమకు సహాయం అవసరమని అంటోంది. 'ఆంక్షలు సడలిస్తామని చెప్పడం ఊరటనిచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం ఉద్దీపన పథకం ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. అప్పుడు ఆర్థిక వ్యవస్థను పునర్ నిర్మించేందుకు దృష్టిసారిస్తాం.' అని నాస్కామ్ తెలిపింది.
కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్, వ్యక్తిగత దూరమే శరణ్యమని వాటి ప్రభావం వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని హిందుస్థాన్ పవర్ ఛైర్మన్ రతుల్ పూరి అన్నారు.
'లాక్‌డౌన్ పొడిగింపు మంచి ఆలోచన. రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయో లేదో చూసి ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షలు సడలిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం.' అని జిందాల్ స్టీల్, పవర్ ఛైర్మన్ నవీన్ జిందాల్ అన్నారు.
ఇదీ చదవండి: 10 శాతం ఐటీ ఉద్యోగాలకు కరోనా గండం!