భారత్లో పసిడికి డిమాండ్ భారీగా పెరిగినట్లు ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. కరోనా పరిస్థితులు మెరుగుపడి, ఆర్థిక కార్యకలాపాలు బలంగా పుంజుకోవడం వంటివి పసిడి అమ్మకాల వృద్ధికి దోహదం చేశాయని వెల్లడించింది. దీంతో కరోనా ముందు నాటి సాధారణ పరిస్థితులకు పడిసి డిమాండ్ చేరుకుందని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది.
47శాతం పెరిగిన డిమాండ్
- ఈ ఏడాది సెప్టెంబరు ముగింపు త్రైమాసికానికి పసిడి డిమాండ్ 47 శాతం పెరిగి.. 139.1 టన్నులకు చేరుకుంది. ఇది 2020లో ఇదే సమయానికి 94.6 టన్నులుగా ఉంది.
- విలువ పరంగా చూస్తే.. భారత్లో 2020లో బంగారం డిమాండ్ రూ.43,160 కోట్లుగా ఉంది. 2021లో ఇది 37శాతం పెరిగి రూ.59,330 కోట్లకు చేరుకుంది.
- ఆభరణాల విషయానికొస్తే.. 2020తో పోల్చితే డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరింది. ఇది గతేడాది 68.8 టన్నులుగా ఉంది.
- విలువ పరంగా చూస్తే.. 2020తో పోల్చితే 48 శాతం పెరిగి రూ.41,030 కోట్లకు ఎగబాకింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.27,750 కోట్లుగా ఉంది.
- బంగారంపై పెట్టుబడి డిమాండ్ గతేడాదితో పోల్చితే.. 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా.. 19 శాతం పెరిగి రూ.18,300 కోట్లకు చేరుకుంది.
- పన్నులు లేకుండా మొత్తం నికర బులియన్ దిగుమతులు 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరుకున్నాయి. ఇది 2020 ఇదే త్రైమాసికంలో 89 టన్నులుగా ఉంది.
- దేశంలో రీసైకిల్ చేసిన మొత్తం బంగారం 50 శాతం క్షీణించి 20.7 టన్నులకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో 41.5 టన్నులుగా ఉంది.
7 శాతం తగ్గిన గోల్డ్ ఈటీఎఫ్
2020 జులై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2021లో అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 7 శాతం తగ్గి.. 831 టన్నులకు పడిపోయినట్లు డబ్ల్యూజీసీ నివేదికలో పేర్కొంది. ఇది 2020లో 894.4 టన్నులుగా ఉంది. గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (గోల్డ్ ఈటీఎఫ్) నుంచి ప్రవాహాలే ఇందుక కారణమని తెలిపింది.
- నికర గోల్డ్ ఈటీఎఫ్ అమ్మకాలు గతేడాదితో పోల్చితే స్వల్పంగా (27 టన్నులు) తగ్గాయి. 2020లో ఇదే సమయంలో పసిడి అమ్మకం 274 టన్నులుగా ఉంది.
- ఆభరణాల విషయానికి వస్తే.. పసిడికి 33 శాతం డిమాండ్ పెరిగి.. 443 టన్నులకు చేరింది. 2020లో ఇదే సమయంలో 333టన్నులుగా ఉంది.
- టెక్నాలజీలో బంగారం వినియోగం 9శాతం పెరిగి 83.8టన్నులకు చేరింది. 2020లో 77.2 టన్నులుగా ఉంది.
- పసిడి ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. సరఫరా 3 శాతం తగ్గి 1,239 టన్నులకు చేరింది. గతేడాది 1,279.4 టన్నులుగా ఉంది.
- బంగారం రీసైక్లింగ్ గణనీయంగా తగ్గడం వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గాయి.
ఇదీ చూడండి: Credit Card: రెండో క్రెడిట్ కార్డు ఎప్పుడు తీసుకోవాలి?