ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదవ స్థానంలో ఉన్న ఇండియా.. తాజాగా ఆరో స్థానానికి పడిపోయిందని బ్రిటన్కు చెందిన సెంటర్ ఫర్ ఎకానమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్(సీఈబీఆర్) తెలిపింది. ప్రస్తుతం యూకే తిరిగి తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని ఆ సంస్థ వార్షిక నివేదిక వెల్లడించింది.
కరోనా సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోవడం దానికి కారణాలని ఆ సంస్థ పేర్కొంది. అయితే 2024 నాటికి భారత్ తిరిగి యూకేను వెనక్కి నెట్టి.. 2025లో మళ్లీ ఐదవ స్థానానికి వస్తుందని అంచనా చేసింది. అంతేకాదు.. 2030 నాటికి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా మూడో స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికర అంశాలు తన నివేదికలో పేర్కొంది.
2025లో ఐదు.. 2030 నాటికి మూడు..
- 2021 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 9శాతం, 2022లో 7 శాతంగా నమోదు అవుతుందని సీఈబీఆర్ సంస్థ అంచనా వేసింది.
- ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వృద్ధి రేటు పడిపోవడం భారత్కు సహజమేనని.. వృద్ధిరేటు తగ్గుదలకు కారణంగా చెప్పింది.
- 2035 నాటికి ఇండియా జీడీపీ 5.8 శాతంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో 2025లో బ్రిటన్ను, 2027లో జర్మనీని, 2030లో జపాన్ను.. భారత్ అధిగమిస్తుందని నివేదిక పేర్కొంది.
- 2028 నాటికి చైనా.. అమెరికాను అధిగమించి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని సదరు సంస్థ అభిప్రాయపడింది.
- డాలర్ విలువ ఆధారంగా మూడో స్థానంలో ఉన్న జపాన్ను.. 2030లో భారత్ అధిగమిస్తుందని సీఈబీఆర్ అంచనా వేసింది.
"వృద్ధి నెమ్మదించడమనేది బ్యాంకింగ్ వ్యవస్థ, సంస్కరణలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కరోనా మహమ్మారి భారత్కు మానవ, ఆర్థిక విపత్తుగా పణమించింది. ఇప్పటివరకు 1.40 లక్షల మరణాలు సంభవించాయి. అమెరికా తర్వాత ఇక్కడే ఎక్కువ మంది చనిపోయారు. 2019లో జీడీపీ 4.2 శాతంగా నమోదైంది. ఇది పదేళ్ల కనిష్ఠానికి సమానం. 2016లో ఉన్న 8.3 శాతం జీడీపీలో దాదాపు సగం. అయినప్పటికీ భారత్ గొప్పగా పుంజుకుంటుంది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్.. వ్యాక్సిన్ల తయారీలో ముందంజలో ఉంది. వచ్చే ఏడాది మరింత మెరుగైన స్థానంలో ఉంటుంది" అని సీఈబీఆర్ నివేదిక తెలిపింది.