సౌర విద్యుత్ (సోలార్ ఎనర్జీ) వాటాను వచ్చే పదేళ్లలో దేశీయ ఇంధన వినియోగంలో మూడో వంతుకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలపై దృష్టి సారిస్తోంది. ప్రధానంగా యేటా 25 గిగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించడంతో పాటు దేశీయంగా సౌర విద్యుత్ పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు చైనా, మలేషియాల నుంచి దిగుమతి అవుతున్న పరికరాలపై సుంకాన్ని భారీగా పెంచాలని భావిస్తోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకంలోకి సౌర విద్యుత్ పరికరాల తయారీ రంగాన్ని కూడా ఇటీవల తీసుకొచ్చింది.
20 కాదు.. 40 శాతం!
సౌర మాడ్యుల్స్, సెల్స్ దిగుమతులపై 20 శాతం ప్రాథమిక దిగుమతి సుంకాన్ని (బీసీడీ) కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించే అవకాశం ఉందని గత డిసెంబరులో భావించారు. అయితే తాజాగా దాన్ని వరుసగా 40%, 25% శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.
2018 జులై నుంచి ఇప్పటి వరకు అమల్లో ఉన్న 15% సేఫ్‌గార్డ్ సుంకం (దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు) గడువు ఈ ఏడాది జులైతో ముగియనుంది. వచ్చే మార్చి వరకు ఇదే సుంకాన్ని కొనసాగించనుంది. ఇప్పటికే చైనా ఉత్పత్తిదార్లతో ఒప్పందాలు చేసుకున్న భారతీయ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తర్వాత భారీగా సుంకాలు చెల్లించాల్సి రావచ్చు. దీంతో వారు స్థానిక తయారీదార్లకే ఆర్డర్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.
2022 ఏప్రిల్ 1 నుంచి సౌర పీవీ మాడ్యుల్స్‌పై 40%, సౌర పీవీ సెల్స్‌పై 25% దిగుమతి సుంకాన్ని విధించాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది.
చైనాదే ఆధిపత్యం...
వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రోపర్టీ ఆర్గనైజేషన్ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం, సౌర ఫలకాలకు వినియోగించే మాడ్యుళ్లు, సెల్స్, కడ్డీలు, వాఫర్లు, పాలీ సిలికాన్ వంటి ముడి సామగ్రి చైనాలోనే ఎక్కువగా తయారవుతున్నాయి. భారత్‌తో సహా ఇతర దేశాలన్నీ ఆ దేశ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ప్రపంచ తయారీ సామర్థ్యంలో 81 శాతం కడ్డీలు, 84 శాతం వాఫర్లు, 66 శాతం క్రిస్టలీన్ ఫొటోవాల్టెక్ (పీవీ) సెల్స్, 82 శాతం క్రిస్టలీన్ పీవీ మాడ్యుళ్లు ఇక్కడే తయారవుతున్నాయి. ఇవన్నీ 2012 లెక్కలు. కాగా, గత మార్చిలో ది అమెరికన్ ప్రాస్పెక్ట్ ప్రచురించిన దాని ప్రకారం, ఇవి వరుసగా 95%, 99%, 80%, 75%గా ఉన్నాయి.
పీఎల్‌ఐ పరిధిలోకి...
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఇటీవల కేంద్రం పలు రంగాలను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకంలోకి తీసుకొస్తోంది. సౌర విద్యుత్ ఉపకరణాల తయారీ రంగాన్ని కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇందుకు రూ.4,500 కోట్లను కేటాయించింది. దీంతో సుమారు రూ.1.97 లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ఊతమిచ్చినట్లు అవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 15 కంపెనీలు ఈ రంగంలో 300 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22,500 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక్కడ ఉత్పత్తి బాగా పెరిగితే, ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి చైనాపై ఆయా దేశాలు ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇబ్బంది అదొక్కటే...
ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్) పరిధిలో ఉన్న సౌర విద్యుత్ కంపెనీల్లో తయారయ్యే పరికరాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తే, ఇప్పుడున్న నిబంధనల మేరకు అవి దిగుమతుల కిందకే వస్తాయి. అంటే వాటిపై కూడా భారీగా దిగుమతి సుంకం విధించే పరిస్థితి ఉంది. సౌర ఫలకాలు తయారు చేసే కంపెనీలు 43 శాతం, సెల్స్ తయారీ కంపెనీలు 63 శాతం ఎస్‌ఈజెడ్‌లలోనే ఉన్నాయి. దీంతో దేశీయ సౌర పరికరాల తయారీ రంగ వ్యవస్థకు ఇబ్బందులు కలుగుతాయని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి.
దిగుమతులు.. లక్ష్యాలు
- భారత్ 2018-19లో 2.16 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16,200 కోట్లు) విలువైన సౌర పీవీ సెల్స్, ప్యానెళ్లు, మాడ్యుళ్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఇందులో అధిక భాగం చైనా నుంచే దిగుమతయ్యాయి.
- ఈ స్థాయిలో దిగుమతులు పెరుగుతుండటంతో 2018 జులై 30న ప్రభుత్వం దిగుమతులపై సేఫ్‌గార్డ్ డ్యూటీని (15 శాతం) విధించింది.
- 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) సామర్థ్యాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో 100 గిగా వాట్లు సౌర విద్యుత్ ఉండాలని భావిస్తోంది.
- కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ రూపొందించిన ఆప్టిమమ్ ఎనర్జీ మిక్స్ నివేదిక ప్రకారం, 2029-30 నాటికి దేశ విద్యుత్ వినియోగావసరాలు 817 గిగా వాట్లకు చేరే అవకాశం ఉంది. ఇందులో 450 గిగా వాట్ల విద్యుదుత్పత్తి పునరుత్పాదక ఇంధనంతో ఉండాలని ప్రతిపాదించింది. దీంట్లోనూ 280 గిగా వాట్లు సౌర విద్యుత్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలనుకుంటోంది. అంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, 2030 వరకు ప్రతి ఏడాది 25 గిగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ఇదీ చూడండి: భారీగా తగ్గిన ప్రయాణికుల వాహన ఎగుమతులు