కరోనా కారణంగా ఎదుర్కొన్న నష్టాలు, సంస్థ వ్యయాలు తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా 35,000 మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది హెచ్‌ఎస్‌బీసీ. అదే సమయంలో ఎటువంటి నియామకాలను చేపట్టడం లేదని ప్రకటించింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,35,000 మంది సిబ్బందికి మెమోలు పంపినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియోల్ క్విన్ పేర్కొన్నారు. కాగా, మెమోలోని ఉద్యోగుల తొలగింపు అంశం వాస్తవమేనని బ్యాంకు అధికార ప్రతినిధి ఒకరు ధ్రువీకరించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
మార్చిలోనే..
వేతనాల భారం తగ్గించుకునేందుకు మార్చిలోనే ఉద్యోగులను తొలగించాలని ప్రణాళికలు వేసింది హెచ్‌ఎస్‌బీసీ. అయితే కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. లాక్డౌన్ తర్వాత మళ్లీ ఆ దస్త్రంపై పునరాలోచిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి సంస్థ వ్యయాలను సగానికి కుదించుకోవాలని భావిస్తోంది.