పెట్టుబడి మొత్తం ఒకే చోట కేంద్రీకరిస్తే.. నష్టభయం అధికంగా భరించాల్సి ఉంటుంది. అందుకే, పెట్టుబడుల్లో వైవిధ్యం ఎంతో కీలకం. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, స్థిరాస్తి, బంగారం, బ్యాంకు పథకాలు.. ఇలా పలు పథకాల మేళవింపుగా మీ పెట్టుబడుల జాబితాను రూపొందించుకోవాలి. ఏ పెట్టుబడికి ఎంత ప్రాధాన్యం ఇస్తూ కేటాయింపుల వ్యూహాన్ని అమలు చేస్తామన్నదే విజయాన్ని నిర్దేశిస్తుంది. మార్కెట్‌లో ఒకే రంగంలోనో.. ఒకే కంపెనీలోనో.. పెట్టుబడి చేయడం పొరపాటే. విలువ, వృద్ధి ఆధారంగా కీలక రంగాల్లోని కొన్ని కంపెనీలను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ నుంచి మీ పరిస్థితిని బట్టి ఎంపిక చేసుకోవాలి. ఆయా ఎంపికల్లో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు తప్పనిసరి.
అధ్యయనం చేశాకే..
కీలకమైన రంగాలు, కంపెనీలు, మొత్తం మార్కెట్ గురించి అధ్యయనం చేసే కొద్దీ అవగాహన పెరుగుతుంది. ఒకప్పుడు సంస్థలకు, సంస్థాగత పెట్టుబడిదారులకు ఎక్కువగా దొరికే సమాచారం నేడు ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంటోంది. కంపెనీ వార్షిక, త్రైమాసిక తదితర నివేదికలు, ఫలితాలు, పలు సంస్థల అభిప్రాయాలు ఇలా ఎంతో సమాచారం వివిధ రూపాల్లో లభిస్తోంది. ముఖ్యంగా సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్లను పరిశీలిస్తూ ఉండాలి. మార్కెట్ పరిశీలనకు కొంత సమాయాన్ని కేటాయిస్తూ, అధ్యయనం, అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కువ సమాచారం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది రావచ్చు. ఈ విషయంలో జాగ్రత్త తప్పనిసరి.
స్వల్ప- మధ్యకాలానికి..
- ఫండమెంటల్స్ మద్దతు సరిగా లేకున్నా, విలువలు అతిగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చేస్తూ, రుణ భారంతో ఇబ్బందిపడుతున్న కంపెనీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
- ఇప్పటివరకూ మార్కెట్ వృద్ధికి ఉపకరించిన లిక్విడిటీ తగ్గుముఖం పట్టినా.. వడ్డీ రేట్లు పెరుగుతున్నా.. ఇతర అంశాల్లో ప్రతికూలతలు వచ్చినా.. మార్కెట్లు స్వల్ప- మధ్య కాలాల్లో దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు.
- 'అండర్‌వోన్డ్'. అంటే తక్కువ మంది దృష్టిసారించిన కంపెనీలు, అలాగే నాణ్యతతో సరైన ధరల్లో దొరికే కంపెనీలు ప్రస్తుత తరుణంలో పరిశీలించవచ్చు.
- నాణ్యత లేని, ఉన్నా ఆకాశం హద్దుగా పెరిగిన షేర్లకు దూరంగా ఉండటమే మేలు. దిద్దుబాటుకు గురైతే నాణ్యమైన కంపెనీల షేర్లను దశల వారీగా కొనొచ్చు. మంచి లార్జ్‌క్యాప్‌లపై కొంత మేరకు దృష్టి సారించవచ్చు.
- స్వల్పకాలంలో ట్రేడ్ చేసేవారు నష్టాలను తగ్గించుకునేందుకు స్టాప్‌లాస్, ఉన్న లాభాలను రక్షించుకోవడానికి ట్రెయిలింగ్ స్టాప్‌లాస్‌లాంటి వ్యూహాలను పాటించడం మేలు. ఫండమెంటల్స్ బాగుండి, టెక్నికల్స్ కూడా సపోర్ట్ చేసే కంపెనీల్లో వ్యూహం, క్రమశిక్షణతో వ్యవహరించాలి.
- కరోనా మూడో దశ ముప్పు రాకుంటే.. వివిధ సంస్కరణల కొనసాగింపు కొనసాగే అవకాశాలే ఎక్కువ. ఇది ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్‌కు ఉపశమనాన్ని అందించవచ్చు. ఒకవేళ వస్తే ఇబ్బందులు కొనసాగవచ్చు.
ఫండమెంటల్స్‌కు ప్రాధాన్యం..
ఒక షేరులో పెట్టుబడి పెడుతున్నామంటే.. ఆ వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకుంటున్నట్లే. ప్రాథమిక స్థాయి నుంచి వ్యాపారాన్ని విశ్లేషించడమే ఫండమెంటల్ అనాలిసిస్. షేరు ధరను కొన్ని సందర్భాల్లో మార్కెట్ సెంటిమెంట్, ఎక్కువ సందర్భాల్లో వాటి ఫండమెంటల్స్ ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా కంపెనీపైనే అధిక దృష్టి పెట్టే పరిశోధనలో.. వాటి యాజమాన్యం, ఉత్పత్తులు, సేవలలాంటి ఆర్థికేతర అంశాలు, అమ్మకాలు-లాభాలువంటి ఆర్థిక అంశాలు, నిష్పత్తుల విశ్లేషణలో చూసే ఈపీఎస్, పీఈ, ఆర్‌ఓఈ, ఆర్‌ఓసీఈ లాంటి పలు అంశాలను లోతుగా చూడాలి. ఇలా చేయడం వల్ల పూర్తిస్థాయి స్థితిగతులతో పాటు, వృద్ధి అవకాశాలపై స్పష్టత వస్తుంది. అవసరమైతే ఫండమెంటల్స్‌కు టెక్నికల్స్ జోడించి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
- ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీ లేదా ఐపీఓకి వచ్చిన కంపెనీ అయినా విలువలు అతి ప్రియంగా ఉన్నా.. కార్పొరేట్ గవర్నెన్స్ సరిగా లేకున్నా నష్టం రావచ్చు. కాబట్టి, అప్రమత్తంగా వ్యవహరించాలి.
- దీర్ఘకాలానికి..
- 3 నుంచి 5 ఏళ్ల కాలానికి మదుపు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మంచి షేర్లు, ఆకర్షణీయమైన ధరలకు దొరుకుతున్నప్పుడు కొనుగోళ్లు చేస్తూ ఉండాలి.
- కొత్తగా మార్కెట్‌లోకి వచ్చేవారు ఈటీఎఫ్‌లు, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లు లేదా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లను ప్రారంభించాలి. అవగాహన పెరిగే కొద్దీ నాణ్యమైన షేర్లను దీర్ఘకాలానికి కొనవచ్చు.
- సరైన సమయం లేని వారు, మార్కెట్‌పై పూర్తిస్థాయి అవగాహన లేని వారు మ్యూచువల్ ఫండ్లలో సిప్ ద్వారా లేదా ఎంపిక చేసుకున్న నాణ్యమైన షేర్లలో నెలనెలా కొంత పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చు.
- పెట్టుబడుల వైవిధ్యంలో భాగంగా ద్రవ్యోల్బణాన్ని, ఆర్థిక అనిశ్చితి తదితర ప్రభావాల్ని తట్టుకొని రాణించగల బంగారంలో 10 శాతం వరకూ పెట్టుబడులు పెట్టవచ్చు. దీర్ఘకాలిక అవకాశాల్ని పరిగణనలోనికి తీసుకొని, స్థిరాస్తిలోనూ కొంత మదుపు చేయాలి. రీట్స్ ద్వారా కూడా స్థిరాస్తి పెట్టుబడి ప్రయోజనాల్ని పొందే వీలుంది.
- గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సంక్షోభాలను, అవరోధాలను మార్కెట్లు చూశాయి. అయినా.. దీర్ఘకాలానికి మెరుగైన రాబడిని అందించాయి. కాబట్టి, మార్కెట్ పయనాన్ని కచ్చితంగా అంచనా వేయడంకన్నా.. మంచి కంపెనీని ఎంపిక చేసుకొని, విలువ-వృద్ధి ఆధారంగా ధరను నిర్ణయించుకొని, వివిధ స్థాయుల వద్ద దీర్ఘకాలానికి పెట్టుబడులు పెడితే.. లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
- జె.వేణుగోపాల్, జెన్ మనీ
ఇవీ చదవండి: