Gst rules changes : దేశ వ్యాప్తంగా అమలవుతున్న వస్తు సేవల పన్నులో వచ్చిన పలు మార్పులు, చేర్పులు జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి. 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పలు సేవలు, వస్తువులపై విధిస్తున్న జీఎస్టీ స్లాబుల్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేసింది. ఇందువల్ల పలు వస్తువుల సేవలు ఒకటో తేదీ నుంచి ప్రియం కానున్నాయి. అసంఘటితంగా ఉన్న పలు రంగాలపై కూడా జీఎస్టీ కౌన్సిల్ పన్నువడ్డించింది. అందులో ప్రధానంగా వస్త్రాలు, చెప్పులు, జొమాటో, స్విగ్గీ సేవలు, ఊబర్, ఓలా రవాణా సేవలపై కూడా జీఎస్టీ భారం పడనుంది. ఈ మార్పులన్నీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం నుంచి అమలులోకి వస్తాయి.
పెరగనున్న దుస్తుల ధరలు..
జనవరి 1 నుంచి అన్ని వస్త్రాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమపై ఉన్న 5% జీఎస్టీకి అదనంగా మరో 7% శాతం జోడించి... 12 శాతానికి పెంచనుండటమే ఇందుకు కారణం. ఇకపై వస్త్రాలు కొనుగోలుదారుల నుంచి వస్త్రవ్యాపారులు 12శాతం జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది.
పాదరక్షలూ ప్రియం కానున్నాయి..
ఇప్పటి వరకు రూ.1000 లోపు ఖరీదున్న చెప్పులు కొనుగోలుపై 5శాతం ఉన్నజీఎస్టీ 12శాతానికి పెంచింది. ఒకటో తేదీ నుంచి వెయ్యి లోపు ఖరీదు ఉన్న చెప్పులపై 12 శాతం... మిగిలిన అన్నిరకాల చెప్పులపై 18శాతం జిఎస్టీ కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెప్పులు, షూస్ ధరలు వచ్చే ఏడాది నుంచి పెరగనున్నాయి.
ఆటో బుకింగ్ మరింత భారం..
ఊబర్, ఓలా లాంటి ఆన్‌లైన్ రవాణా సర్వీసులకు చెందిన కార్లు అద్దెకు తీసుకుంటే 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆటో, ద్విచక్రవాహనం సేవులు వినియోగించుకున్నా 5శాతం జిజీఎస్టీ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. 2022, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆఫ్‌లైన్ లేదా బయట ఉండే ఆటో సేవలను వాడుకుంటే మాత్రం ఎలాంటి పన్ను భారం ఉండదు. నేరుగా ఆటోలను పిలిచి ఉపయోగించుకుంటే జీఎస్‌టీ వర్తించదు.
స్విగ్గీ, జొమాటో ఆర్డర్లపై 5శాతం జీఎస్టీ..
అదే విధంగా హోటళ్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా ఆహార పదార్ధాలను చేరవేస్తున్న జొమోటా, స్విగ్గీలాంటి ఆన్‌లైన్ సంస్థలు ఇప్పటి వరకు 20లక్షలుపైగా టర్నోవర్ కలిగిన హోటళ్ల నుంచి తెచ్చే ఆహార పదార్ధాలపై మాత్రమే 5శాతం జిఎస్టీ అమలులో ఉంది. అయితే ఇందువల్ల జొమోటా, స్విగ్గీ లాంటి చేరవేసే ఆహార పదార్ధాలల్లో చాలా వరకు ఈ జీఎస్టీ వర్తించడంలేదు. ఇందులో ఎక్కువ భాగం రూ. 20లక్షలు టర్నోవర్‌కు తక్కువగా ఉండడం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోవడం లాంటి కారణాల వల్ల జీఎస్టీ చెల్లింపులు ఉండేవి కావు. ఇకపై జనవరి ఒకటో తేదీ నుంచి జొమోటా, స్విగ్గీలాంటి ఆన్‌లైన్ సంస్థల ద్వారా ఆహార పదార్ధాలను చేరవేసే ప్రతి ఆర్డర్‌పై 5శాతం జీఎస్టీ కొనుగోలుదారుడి నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా చేరవేసే ఆహారపదార్ధాలపై హోటళ్ల బదులు స్విగ్గీ, జొమోటా సంస్థలే జీఎస్టీ వసూలు చేస్తాయి. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన వర్క్స్ కాంట్రాక్టులపై 5శాతం, ఇతర వర్క్స్ కాంట్రాక్టులపై 18శాతం జీఎస్టీ అమలవుతోంది. అయితే కొత్తగా తెచ్చిన మార్పుల కారణంగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలు చేసే వర్క్స్ కాంట్రాక్టులపై మాత్రమే కొన్నింటికి 5శాతం, మరికొన్నింటికి 12 శాతం జీఎస్టీ ఉంటుండగా, మిగిలిన అన్ని వర్క్ కాంట్రాక్టులపై 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని వస్తు సేవల పన్ను స్పష్టం చేసింది.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి..
పన్ను చెల్లింపుదార్లు జీఎస్టీ రిఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి కొత్త సంవత్సరం నుంచి ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పాన్ నెంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోనే జీఎస్టీ రీఫండ్స్ వేసేలా చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకుగాను జీఎస్టీకి సంబంధించి వివిధ నిబంధనల్లో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ (CBIC) సవరణలు చేసింది.
గడిచిన నెల జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయకుంటే..
గడిచిన నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-3బీ రిటర్నులను దాఖలు చేయని వ్యాపారులు జనవరి 1 నుంచి జీఎస్‌టీఆర్-1లో బయటకు పంపే సరఫరాలను నమోదు చేయడానికి వీలుండదని జీఎస్‌టీఎన్ స్పష్టం చేసింది. ఏదైనా నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-1ను దాఖలు చేయడానికి తర్వాతి నెలలో 11వ రోజు వరకు గడువు ఉంటుంది. ఇక జీఎస్‌టీఆర్-3బీ(పన్ను చెల్లింపుల ఫారమ్) రిటర్నులను తర్వాతి నెలలో 20-24 రోజుల మధ్యలో చేస్తారన్న సంగతి తెలిసిందే. జీఎస్‌టీఆర్-1 రిటర్నులను దాఖలు చేయడంలో పరిమితిని విధించే సెంట్రల్ జీఎస్‌టీ నిబంధనల్లోని రూల్-59(6) జనవరి 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని జీఎస్‌టీకి సాంకేతికత సహకారం అందిస్తున్న జీఎస్‌టీఎన్ స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఒక నమోదిత వ్యక్తి.. గడచిన నెలకు ఫారమ్ జీఎస్‌టీఆర్-3బీ రిటర్నులు దాఖలు చేయకపోతే.. ఫారమ్ జీఎస్‌టీఆర్-1లో వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరా (అవుట్‌వర్డ్)లను నమోదు చేయడానికి అనుమతి ఉండదు. అలాగే క్రితం నెల జీఎస్‌టీ చెల్లించడంలో విఫలమైనా.. జీఎస్‌టీఆర్-1ను దాఖలు చేయలేరు.
నోటీసులు లేకుండానే తనిఖీలు..
ఒకవేళ వ్యాపారాలు జిఎస్టీఆర్-1, జిఎస్టీఆర్-3 మధ్య సరిపోలకుండా రిటర్న్‌లు దాఖలు చేస్తే ఆ మేరకు జీఎస్టీని రికవరీ చేయడం కోసం పన్ను అధికారులను ఆ సంస్థలకు పంపే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్త నియమం ప్రకారం.. రికవరీ కోసం ఎలాంటి నోటీస్ అందించాల్సిన అవసరం లేదు. జీఎస్‌టీ ఫారాలను స్వతహగా సంస్థలే నింపడంతో, అందులో ఏమైనా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తిస్తే వెంటనే ఆ మొత్తాన్ని రికవరీ చేయడం కోసం అధికారులను నేరుగా నోటీసు లేకుండా పంపే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కొత్త నిబంధన కూడా నూతన సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.
ఇదీ చూడండి: KTR about Textiles GST : జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్