ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బిడ్లను దాఖలు చేసేందుకు గడువును పొడిగించింది. ఆసక్తి ఉన్నవారు వాటా కొనుగోలు దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణయించిన గడువును మార్చి 17 నుంచి ఏప్రిల్ 30 వరకు పెంచింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(డీఐపీఏఎం) ప్రకటన చేసింది.
"కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బిడ్డర్లు మరింత సమయం కావాలని కోరారు. అందువల్ల గడువును మార్చేందుకు మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంది."
- డీఐపీఏఎం
100 శాతం విక్రయం..
ఎయిర్ ఇండియాలో 100శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం(ఏఐఎస్‌ఏఎం) కూడా అంగీకరించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని గతేడాది మార్చిలోనే ప్రభుత్వం ప్రణాళిక వేసింది.
సంస్థను కాపాడేందుకు ఐదేళ్లు సమయం ఇవ్వాలన్న పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫారసును విస్మరించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ప్రతిపాదిత అమ్మకం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి వాటా అమ్మకానికి సిద్ధమయింది. 2018-19 సంవత్సరంలో ఎయిర్ ఇండియా నష్టం రూ.8,556.35కోట్లుగా ఉంది.
ఇదీ చూడండి: నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ నుంచి ఎస్ బ్యాంక్ షేర్లు ఔట్