ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమకు 2.42 బిలియన్ యూరోల జరిమానా విధిస్తూ ఈయూ నియంత్రణ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గూగుల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో గూగుల్‌పై జరిమానా సరైందేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. అసలేం జరిగిందంటే..
తన సొంత షాపింగ్ సర్వీసుకు అనుకూలంగా వ్యవహరించడం కోసం గూగుల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై 2017లో యూరోపియన్ కమిషన్ గూగుల్‌కు 2.4 బిలియన్ యూరోల జరిమానా విధించింది. అయితే జరిమానాను సవాల్ చేస్తూ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జనరల్ కోర్టులో గూగుల్ అప్పీల్ చేసింది. యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా 2017లోనే తాము సెర్చ్ ఇంజిన్‌లో మార్పులు చేశామని, అందువల్ల జరిమానా ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరింది.
అయితే ఈ అభ్యర్థనను జనరల్ కోర్టు తిరస్కరించింది. 'వాస్తవంగా చూస్తే గూగుల్.. కంపీటింగ్ సర్వీసెస్(పోటీ సేవలు) కంటే ఎక్కువగా తమ సొంత షాపింగ్ సర్వీస్‌కు అనుకూలంగా వ్యవహరించినట్లే కన్పిస్తోంది. దీనివల్ల మెరుగైన ఫలితాలకు బదులుగా మరో ఫలితాలు వచ్చాయి' అని న్యాయస్థానం పేర్కొంది. గూగుల్ అభ్యర్థనను కొట్టివేస్తున్నట్లు చెప్పిన కోర్టు.. జరిమానాను సమర్థిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ జరిమానాతో పాటు గూగుల్‌పై యూరోపియన్ నియంత్రణ సంస్థలు మరో రెండు యాంటీ ట్రస్ట్ పెనాల్టీలను కూడా విధించాయి. అవన్నీ కలిపి గూగుల్ మొత్తంగా 8.25 బిలియన్ యూరోల జరిమానా చెల్లించాల్సి ఉంది. వీటిపైనా గూగుల్ న్యాయస్థానాల్లో అప్పీళ్లు దాఖలు చేసింది.
ఇదీ చూడండి: Nykaa IPO: నైకా అరంగేట్రం అదరహో.. 80% ప్రీమియంతో లిస్ట్