ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రాసిస్ (ఐపీఎఫ్) వ్యాధిని అదుపు చేసే నిన్డానిబ్ (నిన్టేడానిబ్ 100 ఎంజీ, 150 ఎంజీ క్యాప్సూల్స్) జనరిక్ ఔషధాన్ని గ్లెన్‌మార్క్ ఫార్మా దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఊపిరితిత్తులు గట్టిపడటం, మచ్చలు పడటం ఐపీఎఫ్ వ్యాధి లక్షణాలు. ఊపిరితిత్తులు ఎందుకు ఇలా పాడయ్యాయనే విషయం తెలియకపోతే దాన్ని ఐపీఎఫ్ వ్యాధిగా వైద్యులు బావిస్తారు. దీనివల్ల రోగికి శ్వాస తీసుకోవటం కష్టంగా మారుతుంది. ఇటువంటి వారికి కొవిడ్-19 వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక కొవిడ్-19 వ్యాధి గ్రస్తుల్లోనూ పల్మనరీ ఫైబ్రాసిస్ లక్షణాలు కనిపిస్తాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎఫ్ వ్యాధిని అదుపు చేసే నిన్డానిబ్ బ్రాండెడె జనరిక్ ఔషధాన్ని తీసుకువచ్చినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా పేర్కొంది. ఈ ఔషధంతో రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు, అంతేగాక ఈ జబ్బుపై పోరాటం చేస్తున్న రోగులు, వైద్యులకు ఒక కొత్త ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అవుతోందని వివరించింది. పలు దఫాలుగా నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో నిన్టేడానిబ్ ఔషధం బాగా పనిచేస్తున్నట్లు తేలిందని గ్లెన్‌మార్క్ ఫార్మా వివరించింది. ఈ ఔషధంతో నెల రోజుల చికిత్సకు 100 ఎంజీ క్యాప్సూల్స్ అయితే రూ.4,500, 150 ఎంజీ క్యాప్సూల్స్ అయితే రూ.5,400 ఖర్చు అవుతుందని వివరించింది.
ఇదీ చూడండి: వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రకటనలు నిషేధం: ఫేస్బుక్