సెక్యూరిటీల పెట్టుబడిపై వడ్డీ కింద వొడాఫోన్ ఐడియా నుంచి దాదాపు రూ.149 కోట్లు అందుకున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. అయిదు పథకాలతో కూడిన సెగ్రిగేటెడ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఎన్‌సీడీలపై ఈ మొత్తాన్ని అందుకున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
2020 ఏప్రిల్‌లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఆరు డెట్ పథకాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇందులో అయిదు పథకాలు ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టెర్మ్ ఇన్‌కమ్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్యూరల్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కమ్ అపర్చ్యూనిటీస్ ఫండ్‌లు.. వొడాఫోన్‌లో పెట్టుబడులు పెట్టాయి. వొడాఫోన్ జారీ చేసిన బాండ్లలో ఈ పెట్టుబడులు ఉన్నాయి.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.40,000 కోట్లకు పైగా సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలపై వొడాఫోన్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్ నుంచి వచ్చిన వడ్డీ మొత్తాన్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆయా ఫండ్ల యూనిట్‌దారులకు పంపిణీ చేయనుంది.
ఇదీ చూడండి: నెలకు రూ.9వేలతో ప్రారంభించి.. 15 ఏళ్లలో రూ.కోటి.. ఎలా?