ఆర్థిక వృద్ధిని సూచించే ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి వరుసగా మూడో నెలా ప్రతికూల వృద్ధినే నమోదు చేసింది. డిసెంబరులో ఈ రంగాల ఉత్పత్తి 1.3% మేర క్షీణించింది. ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు రంగాల పేలవ ప్రదర్శన ఇందుకు కారణమైంది.
2019 డిసెంబరులో కీలక రంగాల ఉత్పత్తిలో 3.1 శాతం మేర వృద్ధి ఉండటం గమనార్హం. శుక్రవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కీలక రంగాల గణాంకాల వివరాలు ఇలా..
- ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు రంగాల ఉత్పత్తి వరుసగా 3.6%, 7.2%, 2.8%, 2.9%, 2.7%, 9.7% క్షీణించింది.
- బొగ్గు ఉత్పత్తిలో 2.2 శాతం, విద్యుత్ ఉత్పత్తిలో 4.2 శాతం మేర వృద్ధి నమోదైంది.