వజ్రాల వ్యాపారి, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంటోంది. అతనికి చెందిన విలువైన 13 కార్లను వేలం వేయనుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇందులో రూ.2కోట్లకు పైగా విలువ చేసే కారు కూడా ఉంది. నవంబరు 7న ఈ వేలం జరగనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబరు 6న జరగనుంది.
కోర్టు అనుమతితో వేలం..
ఈ ఏడాది ఆగస్టులో మనీలాండరింగ్ చట్టం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈడీ. నీరవ్ ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. అతడికి చెందిన విలువైన వాచ్‌లు, పెయింటింగ్స్, కార్లను వేలం వేసేందుకు అనుమతి పొందింది.
ఇందులో భాగంగా నవంబరు 7న వేలం నిర్వహించనుంది ఈడీ. 13 కార్లలో రెండు కార్లను మళ్లీ వేలం వేయనున్నారు. ఇందులో రోల్స్‌రాయిస్ ఘోస్ట్ రూ.1.70కోట్లు విలువ చేయగా, పోర్స్‌చే పనామేరా రూ.60లక్షలు విలువైంది. కార్ల స్థితిని బట్టి వేలం ప్రారంభ ధర నిర్ణయిస్తారు.